'అమ్మ' ఆస్తులు కావాలె.!

కోట్లు, వందల కోట్లు, వేల కోట్ల ఆస్తులకు వారసుల్లేకపోతే.. ఆ ఆస్తుల కోసం సరికొత్త వారసులు కొట్టుకుంటే.. ఆ కిక్కే వేరప్పా.! తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారమిలాగే వుందిప్పుడు. అక్రమాస్తుల కేసులో జయలలిత దోషిగా తేలిన మాట వాస్తవం. సినీ రంగంలో సాధించిన పేరు ప్రఖ్యాతులు, తద్వారా ఆర్జించిన ఆస్తుల సంగతి పక్కన పెడితే, ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జయలలిత సంపాదించుకున్న ఆస్తులు తక్కువేమీ కావు. 

జయలలితకి వివాహం జరగలేదు. ఆమెకు వారసులెవరూ లేరు. అయితే, జయలలితకి మేనకోడలు, మేనల్లుడు మాత్రం వున్నారు. ఇందులో మేనల్లుడిది వేరే పార్టీ. మేనకోడలిది మరో పార్టీ. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళే మళ్ళీ. మేనల్లుడేమో, మేనత్తని చంపడానికి కుట్రపన్నాడట. శశికళతో కలిసే తన సోదరుడు జయలలితను చంపేశాడన్నది 'మేనకోడలు' దీప ఆరోపణ. కథ అదిరింది కదూ.! కథ కాదిది, పొలిటికల్‌ డ్రామా.! 

తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరుగులేని పొలిటికల్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న జయలలిత, చివరి రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడారు అనారోగ్యం పరంగా. ఆమెకు ఏమయ్యిందో తెలియదు. కానీ, రెండు నెలలకుపైగా ఆమె ఆసుపత్రిలో వున్నారు. ఓ ముఖ్యమంతి ఇన్నాళ్ళు జైలులో వుండడమంటే చిన్న విషయం కాదు. అంతా సస్పెన్స్‌. జయలలితకు ఎలాంటి చికిత్స జరిగింది.? అసలామెకు సంభవించిన అనారోగ్యమేంటి.? ఇవన్నీ ఇప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నలే. 

జయలలిత ఇప్పుడు లేరు.. కానీ, ఆమె ఆస్తులున్నాయి. ఆ ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా మేనత్తమీద మొసలి కన్నీరు కార్చిన దీప అసలు అంతరంగం ఈ రోజు బయటపడిపోయింది. 'జయలలిత ఆస్తులు నాకే చెందాలి..' అంటూ నిస్సిగ్గుగా ఆమె జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌లోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం పోయెస్‌ గార్డెన్‌ అన్నాడీఎంకేలోని శశికళ వర్గం ఆధీనంలో వుంది. 

చిత్రమైన విషయమేంటంటే ఆస్తులు సమకూర్చుకున్న జయలలలిత వాటిని అనుభవించడానికి జీవించి లేరిప్పుడు. అదే సమయంలో, జయలలిత తర్వాత ఆస్తులు తనవేనని అనుకున్న శశికళ జైల్లో వున్నారు. ఇంతకీ, 'అమ్మ' ఆస్తులు ఎవరికి.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.

Show comments