ఎన్టీఆరూ.. ఇలాగైతే ఎలా బాసూ.?

బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తున్నాడనగానే ఓ రేంజ్‌లో ఈ షోపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. తెలుగు బుల్లితెర రికార్డుల్ని 'బిగ్‌బాస్‌' కొల్లగొట్టేయడం ఖాయమని అంతా అనుకున్నారు. రెమ్యునరేషన్‌ పరంగానూ ఎన్టీఆర్‌ బుల్లితెరపై సరికొత్త రికార్డులు సృష్టించేశాడని ప్రచారమూ జరిగింది. మరి, ఆ స్థాయిలో 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో అలరిస్తోందా.? అంటే, ప్చ్‌.. లేదనే చెప్పాలి. 

మరీ సిల్లీగా 'బిగ్‌బాస్‌' రియాల్టీ షోలో పార్టిసిపెంట్లు నటిస్తున్నారు. నిజానికి ఇదొక రియాల్టీ షో. ఇక్కడ నటడించడం, కాదు జీవించెయ్యాలి. 70రోజులపాటు 14మంది సెలబ్రిటీలు ఓ హౌస్‌లో వుండాలి. హౌస్‌మేట్స్‌ అంతా ఒకరితో ఒకరు కలిసిపోవాలి. కొట్లాడుకోవాలి, కామెడీ చేయాలి.. ఇంకా చాలా చాలానే చెయ్యాలి. కానీ, 'బిగ్‌బాస్‌' హౌస్‌మేట్స్‌ మహా నీరసంగా వ్యవహరిస్తున్నారు. ఆ నీరసం వ్యవహారం కూడా అత్యంత డ్రమెటిక్‌గా సాగుతోంది. 

ఇక, వివాదాల సంగతి సరే సరి. మరీ, చిన్న పిల్లలు చాక్లెట్‌ కోసం కొట్టుకున్నట్టుగా సిగరెట్ల కోసం రచ్చ జరుగుతోంది. నటుడు శివబాలాజీ, సిగరెట్ల కోసం 'బిగ్‌బాస్‌'పైనే ఆగ్రహం వ్యక్తం చేసేశాడు. 'తారక్‌తో మాట్లాడేసి ఏదో ఒకటి తేల్చేస్తా..' అంటూ ఊగిపోతున్నాడు. అతన్ని వారించేందుకు మిగతా హౌస్‌మేట్స్‌ హడావిడి చేయడం. 

ఆదివారం లాంఛనంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌, సోమవారం నుంచి ఇన్‌హౌస్‌ కంటెంట్‌తో బుల్లితెర వీక్షకుల ముందుకొచ్చింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్క ఇంట్రెస్టింగ్‌ మూమెంట్‌ కూడా 'హౌస్‌మేట్స్‌' ప్రదర్శించలేకపోయారు. హిందీ మాట్లాడకూదన్నది ఓ నిబంధన. అది ఎవరూ పాటించడంలేదు. ఇంగ్లీషు సంగతి సరే సరి. 
తెలుగులోనే మాట్లాడమన్నా, తెలుగు సెలబ్రిటీస్‌ కూడా అది పాటించకపోవడం గమనార్హం. 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో ఇంత డల్‌గా నడుస్తుండడంతో, సహజంగానే ఎన్టీఆర్‌ మీదనే ఆ ఇంపాక్ట్‌ పడుతుంది. నిజానికి ఈ రియాల్టీ షోకి సంబంధించినంతవరకు ఎన్టీఆర్‌ చేసేదేమీ వుండదు. కానీ, రియాల్టీ షోకి ముందు ఎన్టీఆర్‌కి పెరిగిన ఎక్స్‌పోజర్‌ అంతా ఇంతా కాదు. తద్వారా ఎన్టీఆర్‌ ఇమేజ్‌ బుల్లితెరపై డ్యామేజీ అయ్యే పరిస్థితి వచ్చేసింది.

Show comments