ఉక్కు మహిళ ఓడిపోయింది

ఉక్కు మహిళ ఇరోం షర్మిల, మణిపూర్‌ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మణిపూర్‌లో సైనిక దళాల ప్రత్యేక అధికారాలను ప్రశ్నిస్తూ, ఇరోం షర్మిల ఏకంగా 16 ఏళ్ళపాటు కఠోరమైన ఉద్యమాన్ని చేపట్టారు.. ఈ క్రమంలో, ప్రపంచంలోనే సుదీర్గ కాలంపాటు (500 వారాలకు పైగా) నిరాహార దీక్ష చేసిన వ్యక్తిగా ఇరోం షర్మిల రికార్డులకెక్కారు. తద్వారా ఆమెకు మణిపూర్‌లోనే కాక, దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా 'ఐరన్‌ లేడీ' అనే గుర్తింపు దక్కింది. 

16 ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి తెరదించుతూ, నిరాహార దీక్షను విరమించిన తర్వాత ఇటీవలే ఇరోం షర్మిల, కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఇకపై, రాజకీయ పోరాటం చేస్తానన్నారామె నిరాహార దీక్ష విరమిస్తూ. మణిపూర్‌ ఎన్నికల్లో తమదే అధికారమంటూ ఇరోం షర్మిల చెప్పుకున్నారుగానీ, స్వయంగా ఆమె ఈ ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం. మణిపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్‌ ఆమెపై ఘనవిజయం సాధించారు. 

ఇరోం షర్మిల 'పీపుల్స్‌ రిసర్జన్స్‌ అండ్‌ జస్టీస్‌ అలయన్స్‌' (పిఆర్‌జెఎ) పేరుతో పార్టీని స్థాపించినా, దాన్ని ఓ రాజకీయ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో విఫలమయ్యారు. దాంతో, ఉద్యమకారిణిగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, ఈ దారుణ ఓటమితో మసకబారిపోయాయిప్పుడు.

Readmore!
Show comments