డెడ్‌లైన్‌ ఓవర్‌.. పవన్‌కళ్యాణ్‌ ఎక్కడ.?

డెడ్‌లైన్‌ ముగిసింది.. కానీ, పవన్‌కళ్యాణ్‌ ఆచూకీ లేదు. రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్‌ ఎంత సీరియస్‌నెస్‌ చూపిస్తారో, ఇప్పటికే చాలా విషయాల్లో స్పష్టమయిపోయింది. హడావిడిగా సోషల్‌ మీడియాలో స్పందించడం, బహిరంగ సభలు పెట్టడం, ఆ తర్వాత అసలు విషయాన్ని మర్చిపోవడం.. ఇదో పరమ రొటీన్‌ వ్యవహారం.. పవన్‌కళ్యాణ్‌కి సంబంధించినంతవరకు. 

చాలా సీరియస్‌ అంశం.. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల వ్యవహారం. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధి పీడితుల్ని జూన్‌ 3న పరామర్శించిన పవన్‌కళ్యాణ్‌, అదే వేదికపైనుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నలభై ఎనిమిది గంటల డెడ్‌లైన్‌ విధించారు. దేనికి? అనడక్కండి.. అదంతే. పార్టీ తరఫున నివేదిక ఒకటి తయారుచేయించుకుని, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని ప్రకటించాక, డెడ్‌లైన్‌ ఎందుకట?

 ఏమో మరి, అప్పుడంటే ఆవేశంగా ప్రకటించేశారుగానీ, ఆ తర్వాత తత్వం బోధపడినట్లుంది పవన్‌కళ్యాణ్‌కి. అందుకే, ఆయన ఆ డెడ్‌లైన్‌ని మర్చిపోయినట్టున్నారు. ఇక, పవన్‌కళ్యాణ్‌ బహిరంగ సభ పెట్టగానే, ఆ మరుసటి రోజు కొందరు అభిమానులు, జనసేన పేరు చెప్పి మీడియాలో హల్‌చల్‌ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కన్పించరు.  

మళ్ళీ ఎప్పుడో.! ఇంతకు మించి, పవన్‌కళ్యాణ్‌ గురించి రాజకీయాల్లో ఆశించడానికేమీ లేదు. రాజకీయాల సంగతెలా వున్నా, సినీ ప్రముఖుడిగా.. ఓ సీరియస్‌ అంశంపై స్పందించినప్పుడు, ఆదిలోనే వదిలేస్తే ఎలా.? పవన్‌కళ్యాణ్‌ విషయం తెలుసు గనుకనే అటు బీజేపీ, ఇటు టీడీపీ.. లైట్‌ తీసుకున్నాయి. ఏదో హడావిడి చెయ్యాలి గనుక, ఉద్దానం కిడ్నీ బాధితుల్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో వుందని మొన్న మంత్రి కామినేని శ్రీనివాస్‌, తాజాగా నేడు చంద్రబాబు ప్రకటించేసి చేతులు దులుపుకున్నారు.

Show comments