మింగడానికి మెతకుల్లేని దేశోద్ధారకులు.!

మింగడానికి మెతుకుల్లేవుగానీ, మీసాలకు శంపెంగ నూనె కావాలన్నాడట వెనకటికి ఒకడు. ఇది ఓ తెలుగు సామెత. అచ్చంగా ఇది తెలుగుదేశం పార్టీకి సూటయిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ఇబ్బందుల్లో వుందంటూ, ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. ఒకటోస్సారి, రెండోస్సారి, మూడోస్సారి.. అంటూ ప్రతి ప్రాజెక్టుకీ ఒకటికన్నా ఎక్కువసార్లు శంకుస్థాపనలు, భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేస్తుంటారు. 

'నేను హైటెక్‌ ముఖ్యమంత్రిని.. నేను ఏం చేసినా 'డాబు' విషయంలో ఏమాత్రం తగ్గకూడదు..' అన్నది చంద్రబాబు స్టయిల్‌. ఆయన్నే ఫాలో అయిపోతుంటారు టీడీపీలో కింది స్థాయి నేతలు, మంత్రులు. 

ఇక, అసలు విషయానికి వస్తే, జీఎస్‌టీ బిల్లుతో ఆంధ్రప్రదేశ్‌కి ఏటా 4,700 కోట్ల నష్టం వాటిల్లుతుందనీ, ఐదేళ్ళలో కలిగే నష్టం 23,500 కోట్లు అనీ ఈ మొత్తాన్ని కేంద్రమే భరించాలనీ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సెలవిచ్చారు. వారెవ్వా, అదిరిందయ్యా.. అన్పించడంలేదూ.! ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్‌ని జీఎస్‌టీ బిల్లు నష్టపరిచినప్పుడు, దాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు సమర్థించిందట.? 

ఎందుకంటే, తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రయోజనాలు ముఖ్యమట. ఇది ఇంకా అదిరింది. ఇక్కడేమో మింగడానికి మెతుకుల్లేవు.. మీసాలకు శంపెంగ నూనె రాసేస్తున్నారు.. అది చాలదన్నట్లు దేశోద్ధారకుల్లా బిల్డప్‌ ఇచ్చేస్తే ఎలా.? ఆల్రెడీ, ఆంధ్రప్రదేశ్‌ తీవ్రమైన ఆర్థిక లోటుతో సతమతమవుతోంది. కేంద్రమేమో, ఇవ్వాల్సినవే ఇవ్వడంలేదాయె. కొత్తగా, ఆంధ్రప్రదేశ్‌కి నష్టం కలిగించేలా కేంద్రం జీఎస్‌టీ బిల్లు తీసుకొస్తే, తద్వారా కలిగే నష్టాన్ని కేంద్రం పట్టించుకుంటుందా.? ఛాన్సే లేదు. 

అసలు, ఆంధ్రప్రదేశ్‌ని పాతాళానికి తొక్కేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు సర్కార్‌ పనిచేస్తోంది తప్ప, ఎక్కడా ఆంధ్రప్రదేశ్‌ని గట్టెక్కిద్దామనే ఆలోచనతో వున్నట్లు కన్పించడంలేదు.

Show comments