ప్రభాస్‌ కాలి గోటినందుకోవడానికి..

ఒకర్ని తిట్టాలంటే, ఇంకొకర్ని పొగడాలి.. ఇదీ రామ్‌గోపాల్‌ వర్మ లెక్క. ఇదేం లెక్క.? అనడక్కండి, ఆయనంతే.! మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌, పవర్‌.. వంటి పదాల్ని ఉపయోగించేసి.. వారందర్నీ అవమానించేసి, వర్మ - ప్రభాస్‌ని పొగిడేశాడు. ప్రభాస్‌ కాలి గోటినందుకోవడానికి వాళ్ళందరికీ, రెండున్నర జన్మలు పడుతుందట. ఇదీ వర్మ, తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన కామెంట్‌. ఇక్కడ, వర్మ ఎవర్ని టార్గెట్‌ చేశాడన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

నో డౌట్‌.. ఐదేళ్ళకు పైగా ప్రభాస్‌, 'బాహుబలి' కోసం పడ్డ కష్టాన్ని అభినందించి తీరాల్సిందే. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, నటీనటులు, టెక్నీషియన్లు.. ఇలా అందరూ కలిసి 'యజ్ఞం'లా బాహుబలి చిత్రాన్ని చేశారు. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా 'బాహుబలి'. ఈ విషయంలో 'బాహుబలి' టీమ్‌ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. వర్మ చెబుతున్న మెగాస్టార్లు, సూపర్‌స్టార్లు కూడా 'బాహుబలి'కి ఫిదా అయిపోయారు. 

అది సరేగానీ, వర్మ చెబుతున్న 'స్టార్లు' ప్రభాస్‌, కాలిగోటినందుకోవడానికి రెండున్నర జన్మలు పడితే, రాజమౌళి కాలి గోటినందుకోవడానికి వర్మకి ఇంకెన్ని జన్మలు పడుతుందట.? ఇది నెటిజన్లు వర్మకి సంధిస్తున్న ప్రశ్న. బట్‌, వర్మ ఇలాంటి ప్రశ్నల్ని, విమర్శల్ని కేర్‌ చెయ్యడు. ఎందుకంటే, ఆయనంతే.

Show comments