నోటు దెబ్బ: పాకిస్తాన్‌కి చావు దెబ్బే.!

భారతదేశంలో నోటు కష్టాల సంగతెలా వున్నా, పాకిస్తాన్‌కి మాత్రం చాబు దెబ్బ తగిలిందనే చెప్పాలి. వాస్తవానికి, 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటన పూర్తిపాఠంలో, నల్ల కుబేరుల వ్యవహారంతోపాటుగా, పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదుల వ్యవహారం కూడా కనిపిస్తుంది. తీవ్రవాదులు, ఫేక్‌ కరెన్సీ ద్వారానే ఆర్థికంగా బలపడ్తున్నారని నరేంద్రమోడీ చెప్పారు. ఈ విషయంలో నరేంద్రమోడీతో ఎవరైనాసరే ఏకీభవించి తీరాల్సిందే. 

పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, భారత కరెన్సీకి ఫేక్‌ని తయారు చేసి, దాన్ని భారతదేశంలోకి అక్రమంగా తరలించి, తద్వారా ఉగ్రవాద సానుభూతిపరులతో తీవ్రవాదులకు ఆర్థిక అండదండలు అందిస్తోందన్నది జగమెరిగిన సత్యం. ఆప్ఘనిస్తాన్‌ నుంచీ, బంగ్లాదేశ్‌ నుంచి కూడా భారత్‌లోకి ఫేక్‌ కరెన్సీ విచ్చలవిడిగా వచ్చేది. గల్ఫ్‌ దేశాలు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. 

ఇక, భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్‌ ఈ వ్యవహారంతో ఒక్కసారిగా కుదేలయ్యింది. ఓ వైపు సర్జికల్‌ స్ట్రైక్స్‌ దెబ్బ, ఇంకోపక్క కరెన్సీ దెబ్బ.. వెరసి, పాకిస్తాన్‌కి తాము పెంచి పోషించిన తీవ్రవాదమే ఇప్పుడు తీవ్ర ముప్పుగా పరిణమించింది. సందట్లో సడేమియా, సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని మరింతగా పెంచి పోషిస్తోందిప్పుడు పాకిస్తాన్‌. 

గతంలో భారత సైన్యం, సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం దాడుల్ని తిప్పికొట్టిన సమయంలో ఎప్పుడూ, తమవైపు నష్టం జరిగినట్లు పాకిస్తాన్‌ ఒప్పుకోలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. భారత సైన్యం, తమ సైన్యాన్ని చంపేస్తోందంటూ గగ్గోలు పెడ్తోంది. నిన్న రాత్రి ఏడుగురు పాక్‌ సైనికులు హతమయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ ధృవీకరించింది. గడచిన వారం రోజుల్లో ఏకంగా 24 మంది సామాన్య పౌరులు మృతి భారత సైనికుల దాడిలో మృతి చెందారన్నది పాక్‌ వాదన. 

సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగినప్పుడు పాకిస్తాన్‌ నోరు మెదపలేదు. ఆ తర్వాత చాలా ఘటనల్లో పాకిస్తాన్‌ సైన్యం మృత్యువాత పడినా పాకిస్తాన్‌ నోరెత్తలేదు. కానీ, ఇప్పుడు పాకిస్తాన్‌ నుంచి 'ప్రాణ నష్టం'పై అధికారిక వార్తలు వెలువడ్తుండడం ఆశ్చర్యకరమే. ఇదంతా చూస్తోంటే, నరేంద్రమోడీ సర్జికల్‌ కరెన్సీ ఆపరేషన్‌కి పాకిస్తాన్‌ బాగానే దెబ్బతినేసినట్లు అన్పించకమానదు.

Show comments