అక్షరాలా.. మూడు వేల కోట్లు ‘గంగ’లో పోసినా..!

గంగా నదీ ప్రక్షాళన.. అటు సెంటిమెంటల్, డివోషనల్ టచ్.. ఇటు పర్యావరణ ప్రియులకూ టచ్.. ఎన్నికల హామీలను ఆ విధంగా కొత్త పుంతలు తొక్కించారు! 

అంత వరకూ సోషల్ మీడియా ద్వారా, మీడియా ద్వారా గంగా నదీ జలం, గంగా తీరాలు.. ఎంత కలుషితం అయ్యాయో తెలుసుకున్న జనులు.. చదువుకున్న వాళ్లు.. మోడీ హామీకి ఫిదా అయిపోయారు! 

పవిత్ర గంగా జలం.. అనే మాట పదే పదే విన్నవాళ్లం, గంగానంది స్థితిపై ఆవేదనతో.. మోడీ మానియాకు లోనయ్యాం!

అందుకు తగ్గట్టుగా.. అధికారంలోకి వస్తూ వస్తూనే, గంగానదీ ప్రక్షాళనకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు, ఆ శాఖకు కాషాయధారిణి ఉమాభారతిని మంత్రిగా చేశారు! ఇంకేముంది.. మోడీ భక్తులు పూనకంతో ఊగిపోయారు! ఆనంద భాష్పాలు రాల్చారు..  తనువులు ఉప్పొంగిపోయాయి, ఎంత అదృష్ట వంతులం.. అని ఆ ఆనందాన్ని పట్టలేకపోయారు! ఇదంతా దాదాపు రెండున్నర సంవత్సరాల కిందటి స్థితి! ఆ రోజులే వేరు.. ఆ ఆనందాలు, భావోద్వేగాలు అవన్నీ వేరే!

ఏకంగా ఈ ప్రాజెక్టుకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్టుగా అధికారంలోకి రాగానే ప్రకటించారు. ఈ దెబ్బకు గంగ మొత్తం ప్రక్షాళన అవుతుందని.. అనేక రాష్ట్రాలకు నీటి కొరత తీరుతుందని.. అంటూ గాల్లో మేడలు కట్టించి చూపించారు.

మరి కట్ చేస్తే.. రెండున్నరేళ్లు గడిచిపోయాయి. గంగా నదీ ప్రక్షాళన అనే బృహత్తర హామీ విషయంలో ఇప్పటి వరకూ సాధించిన ప్రగతి ఏమిటో.. తెలుసా? అసలు.. ఏమైనా సాధించి ఉంటే కదా చెప్పుకోవడానికి! పవిత్ర గంగను పరిశుద్ధంగా మార్చింది లేదు కానీ.. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు అక్షరాలా రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల పైనే! దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు.

మరి అంత ఖర్చు పెడితే.. దాని ఫలితాలు ఏమైనా కానరావొచ్చని ఆశించొచ్చు. అయితే గంగ నదీ కాలుషిత స్థాయిలో ఏ మాత్రం మార్పు లేదని.. ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయిప్పుడు. మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా.. మూడు లీటర్ల నీళ్లు కూడా శుభ్రం కాలేదని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) తీవ్ర హెచ్చరికనే చేసింది. ఇకపై దీని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవద్దు అని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గంగ నదీ నీటి ప్రమాద స్థాయిలో కానీ, నదీ తీరం కలుషిత స్థాయిలో కానీ.. అణువంతైనా మార్పు లేదు, మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఏ మార్పూ తీసుకురాలేకపోయారు.. ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పనిని విరమించుకోండి అని ఎన్జీటీ చాలా ఘాటైన సూచన చేసింది.

ఇదీ పరిస్థితి.. ఎక్కడ ఫెయిలయ్యారు? గంగ పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టి బలహీన మనస్కుల ఓట్లను సులభంగా పొందడంలో సక్సెసయిన మోడీ.. దీని కోసం మూడు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించడంలో విజయం  సాధించిన మోడీ.. మంత్రిని నియమించడంలో, తద్వారా వీర హిందుత్వ వాదుల కళ్లలో ఆనందాన్ని సృష్టించిన మోడీ.. గంగ ప్రక్షాళనలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యారు.

పెట్టిన ఖర్చు తో ఎలాంటి మార్పులనూ తీసుకురాలేకపోయాడు. లోపం ఎక్కడో ప్రభుత్వం కనుక్కోలేకపోతోంది. ఇదేనా శ్రద్ధ? ఇదేనా చిత్తశుద్ధి? చేసినంత ప్రహసనం చాలు, ఇక ఆపండని.. పర్యావరణ బోర్డు హెచ్చరించేంత వరకూ వచ్చింది పరిస్థితి. 

ఒక్క మోడీ ఎన్ని పనులని చేస్తాడు.. అని సర్దుకొందామా, గంగా నదిపై భక్తిని వదిలేద్దామా, నాటి ఉద్వేగాలు నేడు లేవందామా.. మన మోడీనే కదా, మూడు వేల కోట్లే కదా.. గంగా నదే కదా.. అని ఓటేసిన మనసును మోసం చేసుకుందామా?! 

Show comments