మోదీ అద‌ను చూసే కొట్టాడా?

అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మిత్ర‌ప‌క్షంగా మెలుగుతూ అధికారాన్ని పంచుకుంటున్న‌ బీజేపీ పార్టీ నేత‌లు కొంద‌రు చేస్తున్న‌ వ్యాఖ్య‌ల‌కు టీడీపీ నాయ‌కులు షాక్‌కు గుర‌య్యారు. ప్ర‌ధాని మోదీతో భేటీ విష‌యంలో బ‌ద్ద‌శ‌త్రువైన వైసీపీ అధినేత జగ‌న్‌ను కాషాయ‌ నేత‌లు స‌మ‌ర్థిస్తున్న తీరు చూపి నివ్వెర‌పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశానికి, వైసీపీకి ఓట్ల తేడా ఎంత ..కేవ‌లం రెండు శాత‌మే క‌దా అంటూ విష్ణుకుమార్‌రాజు లాంటి వారు ఫ‌క్తు ప్ర‌తిప‌క్షంలాగా మాట్లాడుతున్న తీరు ప‌సుపు ద‌ళాన్ని విస్మ‌యానికి గురిచేస్తోంది. కాషాయ‌ నేత‌లు ఇన్నేసి మాట‌లంటున్నా తిరిగి వారిని ఏమీ అన‌లేక చేష్ట‌లుడిగి చూస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు.  

నిజానికి ఢిల్లీలో జ‌రుగుతున్న అనూహ్య‌ రాజ‌కీయ ప‌రిణామాలు తెలుగుదేశం నేత‌ల‌కు ఏమాత్రం మింగుడుప‌డ‌డం లేదు. ఢిల్లీలోని త‌మ పార్టీ ప్ర‌తినిధుల‌కు మాట‌మాత్ర‌మైనా తెలియ‌కుండా ప్ర‌ధాని మోదీ త‌మ బ‌ద్ధ‌శ‌త్రువు జ‌గ‌న్‌తో భేటీ అవ‌డం, దానిపై తాము విమ‌ర్శ‌ల చేస్తే జాతీయ‌, రాష్ట్ర స్థాయి బీజేపీ నేత‌లు జ‌గ‌న్‌ను వెనుకేసుకురావ‌డం వెనుక మ‌ర్మ‌మేమిటో ప‌చ్చ నేత‌ల‌కు ఒక ప‌ట్టాన‌ పాలుపోవ‌డం లేదు. హైక‌మాండ్ నుంచి వ‌చ్చిన అదేశాల‌ను అనుగుణంగానే బీజేపీ నేతల మాట్లాడుతున్నార‌ని, ఇప్పుడు వారి మాట‌ల‌కు బ‌దిలిస్తే మిత్ర‌ప‌క్షంతో స‌ఖ్యత ఎక్క‌డ చెడుతుందోన‌న్న ఆందోళ‌న వారిని అన్నీ అణుచుకుని కూర్చునేలా చేస్తోంది.

ఇదిలా ఉంటే  కొంద‌రు మాత్రం మోదీ చాలా ప‌క్కాగా అద‌ను చూసే కొట్టాడ‌ని, చంద్ర‌బాబు దేశంలో లేనిది చూసే జ‌గ‌న్‌తో భేటీ అయ్యార‌ని చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై నేరుగా మోదీనే క‌లిసి మాట్లాడ‌దామ‌నుంకుంటే తీరా చంద్ర‌బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకుని ఢిల్లీలో ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఇలాంటి చ‌ర్య‌ల ద్వారా మోదీ ఏమి చెప్పాల‌నుకుంటున్నారో ఒక ప‌ట్టాన అర్థం కాక త‌మ్ముళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అస‌లు విష‌యం ఎక్క‌డ చెడిందా అని కొంద‌రు ఔత్సాహికనేత‌లు ఆరాతీస్తున్నారు.

విభ‌జ‌న హామీల‌ను కేంద్రం గంగ‌లో క‌లిపినా కామ్‌గానే ఉన్నాం క‌దా. ఇచ్చేందేదో తీసుకుని స‌ర్దుకుపోతున్నాం క‌దా. రాష్ట్రంలో ఆ పార్టీ నేత‌ల‌కు కూడా త‌గిన విధంగా మ‌ర్యాద చేస్తున్నాం క‌దా. కేంద్రాన్ని ఏవిధంగానూ నొప్పించ‌కుండా మ‌స‌లుకుంటున్నాం క‌దా. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ప్ర‌జ‌ల్లోకి వెళ్తూ ప్ర‌భుత్వ ఇమేజీని డ్యామేజీ చేస్త‌న్నా కేంద్రాన్ని ప‌ళ్లెత్తు మాటైనా అన‌లేదే. వాళ్లిచ్చిన‌ ప్ర‌త్యేక ప్యాకేజీ అంత‌ కంటే బాగా ఉంద‌ని వంత‌పాడుతూ వెనకేసుకొస్తున్నాం క‌దా. మ‌రెందుకు మోడీ ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు అని కొంద‌రు నేత‌లు విలేక‌రుల వ‌ద్ద ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. భ‌విష్య‌త్తులో ఇంకేమి జ‌ర‌గ‌నుందోన‌ని వారు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు.

Show comments