స్టార్ హీరో ఒకే ఏడాదిలో నాలుగో బ్లాక్ బస్టర్?

‘ముంతిరివల్లికల్ తలిరిక్కుంబోల్’ ఈ టైటిల్ కు అర్థమేమిటో కానీ, ఈ సినిమా తో మోహన్ లాల్ ఈ ఏడాదిలో నాలుగో విజయాన్ని సాధిస్తాడా? అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2016లో సౌతిండియన్ సినిమాల్లో సంచలన స్థాయి విజయాలను సాధించిన వాటి జాబితాలో మోహన్ లాల్ సినిమాలు మూడు ఉంటాయి. వాటిల్లో రెండు సినిమాలు వంద కోట్ల రూపాయల మార్కును దాటాయి!

‘జనతా గ్యారేజ్’, ‘పులి మురుగన్’ సినిమాలతో లాల్.. ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వంద కోట్ల రూపాయల మార్కును రీచ్ అయినట్టైంది. ఈ వయసులో ఈ సూపర్ స్టార్ కెరీర్ లో ఇలాంటి చమక్ లు కనిపిస్తున్నాయి. అలాగే ‘ఒప్పం’ కూడా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అవుతోంది.

ఇలా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు ఈ మలయాళీ స్టార్ హీరో. మామూలుగా ఏడాదికి ఒక్క హిట్టు కొడితేనే హీరోలను పట్టలేం. కానీ లాల్ మాత్రం జయాపజయాలను నిమిత్తం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. మరో సినిమాను రెడీ చేసేశాడు. ఆ సినిమా పేరే.. ‘ముంతిరివల్లికల్ తలిరిక్కుంబోల్’ “మై వైఫ్ ఈజ్ మై లైఫ్’’ అనేది ఈ సినిమా టైటిల్ కు ఉప శీర్షిక.

టైటిల్ను, పోస్టర్ ను బట్టి ఈ సినిమా పక్కా ఫ్యామిలీ డ్రామా అనే విషయం స్పష్టం అవుతోంది. ఇందులో మోహన్ లాల్ తో మీనా జతకట్టింది. ‘దృశ్యం’ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. వరస విజయాలు, హిట్ పెయిర్.. దీంతో  ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

డిసెంబర్ 22 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇది ఏ మాత్రం పాజిటివ్ టాక్ పొందినా.. క్రిస్మస్ సీజన్ లో కేరళలో కలెక్షన్ల వర్షమే కురుస్తుంది. మరి లాల్ వరసగా నాలుగో హిట్ ను కొడతాడేమో చూడాలి! 

Show comments