నంద్యాలకు ఇంకా ఎన్ని సార్లు వెళ్తారేంటి..?

ఇంకా నోటిఫికేషనే విడుదల కాలేదు.. అప్పుడే రెండోసారి బాబు నంద్యాల్లో పర్యటించారు. ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు.. ఐదు మంది ఎమ్మెల్సీలు, ఆరు మంది మంత్రులు.. వీరు గాక లోకల్ లీడర్లు.. అలాగే నారా లోకేష్ బాబు కూడా ఒక సారి నంద్యాలకు వెళ్లొచ్చారు. మరి ఒక్క నియోజకవర్గం విషయంలో ఇంతమంది ఈ స్థాయిలో రంగంలోకి దిగడం కడప, పులివెందుల నియోజకవర్గాల ఉప ఎన్నికల తర్వాత ఇదే తొలి సారి.

వేల కోట్ల రూపాయలు.. రెండో అమరావతి.. నంద్యాల్లో ప్రతి ఒక్కరినీ ఉచితంగా పోషించేస్తాం.. అనే హామీల పరంపర కొనసాగుతూనే ఉంది. మరి అతి సర్వత్రా వర్జయత్ అన్నారు.. తెలుగుదేశం పార్టీ అతిని చూస్తుంటే, ఇదేదో మొదటికే మోసం వచ్చేలా ఉందని అనిపించక మానదు. బోండా ఉమ లాంటి వాళ్లు కూడా నంద్యాల వీధుల్లో తిరిగేసి.. మహిళలను రక్షించేస్తాం అని ప్రకటనలు చూస్తుంటే లోకల్ జనాలు నవ్వుకుంటున్నారు.

మీ జిల్లాలో కాల్ మనీ దందా జరిగితే.. అక్కడ ఉద్ధరించలేని మొహాలు.. ఇక్కడకు వచ్చి రక్షిస్తారా? అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు జనాలు. మరి ఇలాంటి పరమ గాంధేయవాదులను ప్రచారంలోకి దించింది తెలుగుదేశం పార్టీ. మరి వీళ్ల వాళ్ల ఓట్లు పడతాయా? పడే ఓట్లు పోతాయా.. అనేది ఫలితాలను బట్టే చెప్పాల్సి ఉంటుంది. ఇక బాబుగారి రెండో రౌండ్ పర్యటన పూర్తి అయ్యింది.. ఈ నెలాఖరు వరకూ నోటిఫికేషన్ వచ్చేలా లేదు.

బహుశా వచ్చే నెల తొలి వారంలో జరగవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి అయితే కానీ.. నోటిఫికేషన్ రాకపోవచ్చు. మరి నోటిఫికేషన్ వచ్చేలోపు ఇంకెన్ని సార్లు నంద్యాలకు వెళ్తారు? నోటిఫికేషన్ వచ్చాకా ఇంకెన్ని సార్లు చంద్రబాబు అక్కడకు వెళ్లి జనాలను ఆకట్టుకునేస్తారో చూడాలి! మొత్తానికి భూమా నాగిరెడ్డి మరణించి.. చంద్రబాబుకు ప్రశాంతత లేకుండా చేసినట్టున్నాడు

Show comments