తెలుగునాట తనదైన సర్వేలతో 'పొలిటికల్ ఆక్టోపస్' అన్పించుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయం అద్భుతంగా కట్టేశారని కితాబులిచ్చేశారు. తాత్కాలిక సచివాలయమే ఇంత గొప్పగా వుంటే, శాశ్వత కట్టడాలు ఇంకెంత గొప్పగా వుంటాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేసేశారు.
ఇంతకీ, లగడపాటి వున్నపళంగా చంద్రబాబుతో భేటీ అవడమేంటట.? ఏమో మరి, ఆయనకే తెలియాలి. పైకి మాత్రం లగడపాటి 'ఇది జస్ట్ మర్యాదపూర్వక భేటీ మాత్రమే' అని కొట్టి పారేస్తున్నారు. అయితే, టీడీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో చిన్నపాటి 'గలాటా' జరుగుతోంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారట. అంటే, లగడపాటి - కేశినేనికి చెక్ పెట్టబోతున్నారన్నమాట.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, లగడపాటి సచివాలయంలోకి అడుగు పెడుతూనే కొంచెం తడబడ్డారు. తూలిపడబోయి, కవర్ చేసుకున్నారు. ఆ తర్వాత మెట్ల మీద పరుగులు పెట్టారూ.. ఆ పరుగు ఓ రేంజ్‌లో వుంది. తెలంగాణ ఉద్యమం గట్టిగా జరుగుతున్న సమయంలో, లగడపాటి రాజగోపాల్ చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. విజయవాడ నుంచి ఆయన హైద్రాబాద్‌కి 'రహస్యంగా' తరలి రావడం, నిమ్స్ ఆసుపత్రిలో చేరేందుకు పరుగులు పెట్టడం.. ఇదంతా ఓ సెన్సేషన్. ఆ పరుగుని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.
మళ్ళీ ఇప్పుడు అచ్చం అలాంటి పరుగుతో లగడపాటిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. లగడపాటి ఇప్పటికీ అంత ఫిట్‌గా ఎలా వున్నారబ్బా.? ఏమోగానీ, పెప్పర్ స్ప్రే ఎంపీ.. వీర సమైక్యవాది.. అక్కడ పార్లమెంటు పరువు తీసేసి, ఇక్కడ సమైక్యవాదంతో జనాన్ని నిండా ముంచేసి.. రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పేసి, మళ్ళీ టీడీపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేయడమేంటట.? ఇంతకీ, లగడపాటి రాజకీయ ప్రయత్నాలకు చంద్రబాబు పచ్చజెండా ఊపుతారా.? వేచి చూడాల్సిందే.