సరదాకి: సెంద్రబాబూ.. ఏం సెప్తిరి.!

మరీ జనాన్ని అంత వెర్రి వెంగళప్పల్లా చూడాలని చంద్రబాబుకి ఎలా అన్పిస్తోందో ఏమో.! 9 ఏళ్ళపాటు ఏకధాటిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి.. పదేళ్ళు ప్రతిపక్ష నేత హోదా, ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ళుగా ముఖ్యమంత్రి పదవి.. ఎంత అనుభవం వుంటే ఏముంది, కనీస విజ్ఞతని కూడా చంద్రబాబు కనబర్చలేకపోతున్నారు. తన స్థాయిని తానే దిగజార్చేసుకుంటున్నారు అదఃపాతాళానికి. 

చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ వద్ద ఆంధ్రప్రదేశ్‌ సమస్యల్ని ఏకరువు పెట్టారట. 'మీ సమస్య నా సమస్య.. ఆంధ్రప్రదేశ్‌ బాధ్యత నాది..' అని నరేంద్రమోడీ చెప్పారట. అలాగని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు మాటల్ని నమ్మాలా? వద్దా? 

కాస్త వెనక్కి వెళదాం. స్వయంగా నరేంద్రమోడీ ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని. కానీ, ఇవ్వలేదు కదా.! నరేంద్రమోడీ ప్రకటించిన మాటకే విలువ లేదు. ఆయన చెప్పారని, చంద్రబాబు చెబితే నమ్మేదెలా.? అయినా, ఇలాంటి మాటలు ఇప్పుడు చంద్రబాబు కొత్తగా చెబుతున్నవి కావు. ఢిల్లీకి వెళ్ళడం, ప్రెస్‌మీట్లు పెట్టడం.. ఎవరికీ అర్థం కాని మాటలు ఏవేవో చెప్పడం చంద్రబాబుకి మామూలే. 

ఇక, రాజ్యసభలో నేటి పరిణామాల గురించి చంద్రబాబు చాలా సిల్లీ వ్యాఖ్యలు చేశారు. బిల్లు ఓటింగ్‌కి వెళ్ళకపోవడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీయేనట. కాంగ్రెస్‌ గనుక జీఎస్‌టీ బిల్లు విషయంలో మొండిగా వ్యవహరించి వుంటే, జీఎస్‌టీ బిల్లుకి ప్రత్యేక హోదా బిల్లుని అడ్డం వేసి వుంటే, వ్యవహారం కొలిక్కి వచ్చేదని చంద్రబాబు సెలవిచ్చారు. ఛత్‌, ఇంతకన్నా చెత్త కామెడీ ఇంకేమీ వుండదు. 

అసలంటూ జీఎస్‌టీ బిల్లుకి అడ్డుపడాల్సింది టీడీపీనే. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌ కాస్తా జీఎస్‌టీ బిల్లు కారణంగా నాలుగున్నర వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే సెలవిచ్చారు. అలాంటప్పుడు జీఎస్‌టీకి టీడీపీ ఎందుకు మద్దతిచ్చినట్లు.? పైగా, జీఎస్‌టీ బిల్లు చారిత్రాత్మకం.. అని చంద్రబాబు ఇప్పుడు కొనియాడుతున్నారు. అంతటి ప్రతిష్టాత్మక బిల్లుకి కాంగ్రెస్‌ ఎలా అడ్డుతగులుతుందో చంద్రబాబే సెలవివ్వాలి. 

చంద్రబాబుకి ఓ శాపం వుందని పదే పదే చెబుతుండేవారు స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఏమో, అది నిజమేనేమో అని ఇలాంటి సందర్భాల్లోనే రుజువవుతుంటుంది. నరేంద్రమోడీతో చంద్రబాబు ఏం మాట్లాడారో అది చంద్రబాబుకి మాత్రమే తెలుసు. పైకి వచ్చి, ఆయన చెప్పిన మాటల్ని నిజం అని ఎవరూ విశ్వసించే పరిస్థితే లేదు. మిత్రపక్షంగా బీజేపీపై ఒత్తిడి తీసుకురావడం చేతకాని టీడీపీ, కాంగ్రెస్‌కి ఉచిత సలహాలివ్వడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. 

తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి వుంటే.. ప్రత్యేక హోదా వచ్చిందా.. వచ్చింది, లేదంటే కనీసం టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లో కాస్తంతైనా సానుభూతి లభించేది. రోజురోజుకీ టీడీపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో దిగజారిపోతోందంటే, దానికి కారణం ముమ్మాటికీ చంద్రబాబే.

Show comments