ఆనంద్‌ సూర్య ఏ రాష్ట్రం నాయకుడు?

ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావును తొలగించిన తరువాత కొత్తగా నియమితుడైన వేమూరి ఆనంద్‌ సూర్య ఏ రాష్ట్రంవాడు? అంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడా? తెలంగాణకు చెందిన నాయకుడా? ఇదేం సందేహమని కొందరు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితుడైన వ్యక్తి ఏపీకి చెందినవాడు కాకుండా ఎలా ఉంటాడు?

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే కార్పొరేషన్‌కు తెలంగాణవాడిని ఎందుకు ఛైర్మన్‌ను చేస్తారు?...సహజంగా ఈ ప్రశ్నలు ముందుకు వస్తాయి. వేమూరి ఎక్కడివాడనే సందేహం రావడానికి కారణం ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు ప్రచురించిన వార్తలు. వేమూరి తెలుగు దేశం పార్టీ నాయకుడని తెలిసిందే. ఆంధ్రజ్యోతి ప్రకారం వేమూరి గుంటూరు జిల్లా రేపల్లెకు చెందినవాడు. చంద్రబాబుకు వీరవిధేయుడు.

సాక్షి కథనం ప్రకారం.. వేమూరి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవాడు. అయినప్పటికీ ఏనాడో శాశ్వతంగా హైదరాబాదులో స్థిరపడ్డాడు. తెలంగాణ టీడీపీలోనే పనిచేస్తున్నాడు. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లేదా ముషీరాబాద్‌ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. కాని బాబు టిక్కెట్టు ఇవ్వలేదు. ఇదీ ఇతని చరిత్ర. సాక్షి ప్రకారం వేమూరి తెలంగాణ వ్యక్తి అనుకున్నప్పటికీ ఆంధ్రాలో పదవి పొందిన మొదటి తెలంగాణ నాయకుడు వేమూరి కాదు.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత పక్కా తెలంగాణ వ్యక్తి అయిన మాజీ పోలీసు అధికారి రావులపాటి సీతారామరావును ఏపీ పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించారు చంద్రబాబు. రావులపాటి ఖమ్మం జిల్లాకు చెందినవాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ విరమణ తరువాత టీడీపీలో చేరారు. ఈయన కూడా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నాయకుడే. 

వేమూరి హైదరాబాదులో స్థిరపడినప్పటికీ ఆంధ్రా మూలాలు ఉన్నాయి కాబట్టి పదవి ఇచ్చారేమో. ఆంధ్రాలోనూ ఆయనకు పలుకుబడి ఉందని బాబు అభిప్రాయం కావొచ్చు. ఆంధ్రా మూలాలు ఉండి పక్కా తెలంగాణవారిగా మారిపోయిన ఆంధ్రులు హైదరాబాదులో లక్షల మంది ఉన్నారు. మొన్నటివరకు హైదరాబాదే రాజధాని కాబట్టి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఇక్కడికొచ్చి స్థిరపడిపోయారు.

ఇప్పుడు ఆంధ్రాకు తరలివెళ్లాలనే ఆలోచన ఎవ్వరూ చేయడంలేదు. హైదరాబాదులో ఆంధ్రా మూలాలున్న టీడీపీ నాయకులు గత ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుతం వారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారు. దాదాపు అన్ని పార్టీలకు చెందిన నాయకుల్లో ఎక్కువమంది హైదరాబాదులోనే ఉంటున్నారు.

ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలప్పుడు అమరావతికి వెళుతున్నారు. మీడియా హైదరాబాదులోనే కేంద్రీకృతం కావడం, కొందరు నాయకులు పొద్దున్నే లేస్తే టీవీ చర్చల్లో పాల్లొనాల్సివుండటంతో భాగ్యనగరాన్ని వదలడంలేదు. చంద్రబాబు నాయుడే కోట్లు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నారు కదా.

ఆంధ్రా-తెలంగాణ తేడాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో తప్ప రాజకీయాల్లో పెద్దగా కనిపించడంలేదు. చంద్రబాబుకు ఆ పట్టింపు కూడా లేనట్లు కనబడుతోంది. ఒకప్పుడు ఆంధ్రావారిని లంకలో రాక్షసులని తిట్టిన కేసీఆర్‌ ఇప్పుడు పల్లెత్తు మాట అనడంలేదు. కొన్ని తరాల కిందట హైదరాబాదులో, తెలంగాణ జిల్లాల్లో స్థిరపడినవారిలో చాలామంది ఆంధ్రాలో ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నారు.

ఎప్పుడో వచ్చి స్థిరపడిన పెద్దవారికి సొంత రాష్ట్రంపై మమకారం ఉన్నా హైదరాబాదులోనే పుట్టి పెరిగి, ఇక్కడే చదవుకొని, ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి ఆంధ్రా మీద అసలు మోజు ఉండే అవకాశం లేదు.

ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా వెళ్లారు. కాని ప్రయివేటు కంపెనీల్లో పనిచేసేవారికి, వ్యాపారులకు ఆంధ్రాకు వెళ్లి స్థిరపడాల్సిన అవసరం ఏముంటుంది? ఉద్యమం సమయంలో రెండు ప్రాంతాల ఉద్యోగులు హోరాహోరీగా పోరాడినా విభజన తరువాత అదంతా ముగిసిపోయిన కథ.

Show comments