బాహుబలి కూడా అడ్డుకోలేకపోయాడు

చిన్నాపెద్దా అనే తేడా లేదు. తెలుగు-తమిళ్ లాంటి భాషాభేదాల్లేవ్. సినిమా థియేటర్లలోకి వచ్చిందంటే పైరసీకి గురికావాల్సిందే. బాహుబలి-2 కూడా దీనికి మినహాయింపు కాదు. భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను మొదటి వారం రోజులు పైరసీ బారి నుంచి కాపాడగలిగారు. యూనిట్ కు చెందిన టెక్నికల్ టీంతో పాటు ఫ్యాన్స్ అంతా కలిసి ఈ విషయంలో స్ట్రాంగ్ గా పనిచేశారు. అయితే ఈసారి మాత్రం పైరసీదే పైచేయి అయింది.

సక్సెస్ ఫుల్ గా 2 వారాలు కంప్లీట్ చేసుకున్న బాహుబలి-2 సినిమా మూడో వారం మాత్రం పైరసీ బారిన పడింది. ఎవరు చేశారో.. ఎక్కడ్నుంచి చేశారో తెలీదు కానీ... ఈ సినిమాకు సంబంధించి హై-క్వాలిటీ ప్రింట్ బయటకు వచ్చేసింది. అది ఎంత క్వాలిటీగా ఉందంటే.. పెద్ద టీవీలో పెట్టుకొని చూస్తే ఒరిజినల్ వెర్షన్ కు ఏమాత్రం తీసిపోదు.

విడుదలైన పైరసీ ప్రింట్ లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్ని ఎంపిక చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. బాహుబలి-2 లాంటి సినిమాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూస్తేనే కిక్ అంటూ ఎంతమంది చెబుతున్నప్పటికీ.. తాజాగా విడుదలైన పైరసీ ప్రింట్ దాదాపు అంతే కిక్ ఇస్తోంది. మార్కెట్లో బాహుబలి-2 డీవీడీ కొనుక్కున్నట్టే ఉంది.

మూడో వారం నుంచి థియేటర్లకు రావాల్సింది రిపీట్ ఆడియన్సే. ఈ పైరసీ కారణంగా సినిమాను మళ్లీ వెండితెరపై చూడాలనుకునేవాళ్లు తగ్గిపోతారు. మూవీ వసూళ్లపై అది కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.

Show comments