ప్రజా యుద్ధ నౌకకి భయమేసిందా.?

ప్రజా గాయకుడు గద్దర్‌ని, ప్రజా యుద్ధ నౌక.. అంటుంటారు. ఉద్యమ పాటకు ఊపిరిలూదిన గద్దర్‌, ఎప్పుడూ ఎర్రజెండా చేతపట్టుకునే కన్పిస్తుంటారు. చేతిలో కర్ర, ఆ కర్రకి ఎర్రజెండా.. ఇది గద్దర్‌ ప్రత్యేకత. శరీరంలో తూటాలు అలాగే వున్నా, గుండెల్లోంచి ఉద్యమ పాట విన్పిస్తూనే వుంటుంది. ఎక్కడ ఏ ఎన్‌కౌంటర్‌ జరిగినా, ముందుగా ఆ ఎన్‌కౌంటర్‌ని ఖండించేది గద్దరే. కానీ, ఇప్పుడా గద్దర్‌ మావోయిస్టు ఉద్యమానికి గుడ్‌ బై చెప్పేశారు. 

మావోయిస్టు పార్టీ నుంచి విడిపోతున్నట్లు గద్దర్‌ ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. రాజకీయ వేదికను స్థాపించడానికి గద్దర్‌ చాలాకాలంగా ప్రయత్నిస్తోన్న విషయం విదితమే. అయితే, కొత్త రాజకీయ పార్టీ విషయమై ఇప్పటికీ ఆయన క్లారిటీ ఇవ్వడంలేదు. రాజకీయాల్లోకి వస్తానని మాత్రం అంటున్నారు. చట్ట సభల్లోకి వెళతాననే దీమా వ్యక్తం చేస్తున్నారాయన. ఇంతకీ, గద్దర్‌ మావోయిస్టు బాటను వీడటానికి కారణమేంటట.? 

మొన్నీమధ్యనే ఆంధ్రప్రదేశ్‌ - ఒరిస్సా బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌ దెబ్బకి దాదాపుగా మావోయిస్టు పార్టీ అంతమైపోయిందనే వాదనలు విన్పిస్తున్నాయి. ముఖ్య నేతల్లో చాలామంది ప్రాణాలు కోల్పోవడంతో, మావోయిస్టులు ఇక కోలుకునే పరిస్థితి లేదన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలోనే, గద్దర్‌ 'మావో' బాటను వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

మరోపక్క, గద్దర్‌ - వామపక్షాలతో కలిసి పనిచేయనుండడంపై ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అదే సమయంలో, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ నుంచి గద్దర్‌కి ఇప్పటికే ఆహ్వానం లభించిందనీ, ఆ పార్టీ వైపుగా గద్దర్‌ అడుగులు వేస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. జనసేన, వామపక్షాలతో కలిసి గద్దర్‌ ఓ రాజకీయ కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లోనూ వున్నారట. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. 2019 ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు మాత్రమే సమయం వుంది. ఈలోగా రాజకీయాలు ఎలాగైనా మారొచ్చు.

Show comments