పవన్‌కళ్యాణ్‌ సాధించేశాడనుకోవచ్చా.?

'ప్రత్యేక హోదా ఉద్యమానికి సారధ్యం వహిస్తున్న పవన్‌కళ్యాణ్‌..' అంటూ ఎట్టకేలకు సోషల్‌ మీడియా, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై స్పందించింది. విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ యువత ప్రత్యేక హోదా కోసం గొంతు చించుకున్నా పట్టించుకోని నేషనల్‌ మీడియా, ఏమనుకుందోగానీ.. తాజాగా, ప్రత్యేక హోదా కోసం పవన్‌కళ్యాణ్‌ ఉద్యమిస్తున్నారంటూ, ఆంధ్రప్రదేశ్‌ని పరిగణనలోకి తీసుకుంది. 

'నేషనల్‌ మీడియా, ఆంధ్రప్రదేశ్‌నీ పట్టించుకోవాలి.. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఓ భాగం. మా ఆవేదననీ అర్థం చేసుకోండి.. ప్రపంచానికి చూపించండి..' అంటూ పవ్‌కళ్యాణ్‌, ఈ రోజు మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేశాక, నేషనల్‌ మీడియా కాస్త 'కవర్‌' చేయడానికి ప్రయత్నించింది ఆంధ్రప్రదేశ్‌ ఆవేదనని. పవన్‌కళ్యాణ్‌తో చిన్నపాటి ఇంటర్వ్యూ, ప్రత్యేక హోదాపై డిస్కషన్‌ లాంటి కార్యక్రమమొకటి నేషనల్‌ మీడియా (ఓ ఛానల్‌లోనే లెండి) దర్శనమిచ్చింది. 

జల్లికట్టు ఉద్యమానికి నేషనల్‌ మీడియా మద్దతిచ్చింది.. అలా ఇలా కాదు, ఓ రేంజ్‌లో. అది చట్ట వ్యతిరేక కార్యక్రమమైనా, సుప్రీంకోర్టు నిషేధించినా.. జల్లికట్టు లేకపోతే, అసలు భూమ్మీద మానవ మనుగడే అసాధ్యం.. అనే స్థాయిలో నేషనల్‌ మీడియా రచ్చ రచ్చ చేసేసింది. దురదృష్టవశాత్తూ మూడేళ్ళుగా ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమిస్తున్నా.. దాన్ని నేషనల్‌ మీడియా పట్టించుకోలేదు. 

ప్రజల ఆకాంక్షలపై స్పందిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ప్రజలతో కలిసి ఉద్యమించేందుకు ముందుకొస్తే, ఎయిర్‌పోర్ట్‌లోనే అతన్ని అడ్డగించి, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రన్‌ వే మీదనే కూర్చోబెట్టిన ఘటన జరిగినా.. ప్చ్‌, నేషనల్‌ మీడియా కళ్ళున్న కబోదిలా వ్యవహరించింది. ఇప్పటికైనా, నేషనల్‌ మీడియా ఆంధ్రప్రదేశ్‌ అనే రాష్ట్రమొకటి దేశంలో వుందని గుర్తించినందుకు, అదీ పవన్ గుస్సా అవడంతోనే స్పందించినందుకు సంతోషించాలా.?

Show comments