చినజీయర్ తెలంగాణ వ్యతిరేకినా?

పీఠం ఏదయితేనేం..స్వాముల వారు ఎవరితైనేం..వారి చుట్టూ రాజకీయాలో, రాజకీయాల చుట్టూ వారో తిరుగుతుంటారు. చినజీయర్ స్వామి ఏమీ ఇందుకు మినహాయింపు కాదు. ఆయన చంద్రబాబు అనుకూలం అని గుసగుసలు వున్నాయి. ఈ గుసగుసలు నమ్మబలికేలా, వైఎస్ టైమ్ లో చినజీయర్ స్వామి లైమ్ లైట్ లో వుండకుండా, సైలెంట్ అయ్యారు. చిన జీయర్ కు అందిన ప్రభుత్వ భూములు అన్నీ కూడా చంద్రబాబు హయాంలోనే అందాయనీ అంటారు. సరే, ఈ నిజానిజాలు ఎలా వున్నా, తెలంగాణలో మాత్రం ఇప్పుడు చినజీయర్ ప్రభ వెలుగుతోంది.

తెలంగాణలో చిరకాలం తరువాత అధికారం అందుకున్న సామాజిక వర్గం ఎక్కువగా చినజీయర్ ను ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అధికారం అందడంతో, చినజీయర్ కు రాచమర్యాదలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టే, చినజీయర్ హైదరాబాద్ శివార్లలో వేలాది కోట్ల ఖర్చు అయ్యే స్మారక ప్రాజెక్టు ఒకటి టేకప్ చేసారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ముచ్చట పడి కట్టుకున్న అధికార నివాసం ప్రారంభోత్సవం సందర్భంగా చినజీయర్ కు ఇచ్చిన ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. ఆఖరికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూర్చోవాల్సిన కొత్త కుర్చీలో ముందుగా చినజీయర్ నే కూర్చో పెట్టారు.

తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు దాన్నే తప్పు పడుతున్నారు. చినజీయర్ ఏనాడూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడింది లేదని, అలాంటి సాములోరిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టడం ఏమిటని రేవంత్ నిలదీస్తున్నారు. కానీ ఇక్కడ రేవంత్ ఓ విషయం మరిచిపోతున్నారేమో? ఇదే సాములోరు అటు రేవంత్ పార్టీ నాయకుడు చంద్రబాబుకు, అదే చంద్రబాబుకు అండగా వుండే రామోజీకి కూడా అత్యంత సన్నిహితుడు అని రేవంత్ గుర్తుంచుకోవాలి.

Show comments