రఘువీర సూపర్ లాజిక్, మరి మీరు చేసిన ద్రోహం?

ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాసిన ఒక లేఖ ఆసక్తికరంగా ఉంది. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా బాగా హైలెట్ చేసింది. మరి కాంగ్రెస్ నేత లెటర్ ను తెలుగుదేశం మీడియా హైలెట్ చేసిందంటే.. అందులో మ్యాటరేంటో అర్థం చేసుకోవడం సులభమే. ఆ లెటర్ లో జగన్ పై విరుచుకుపడ్డాడు రఘువీర అందుకే.. టీడీపీ అనుకూల మీడియా ఆ లెటర్ కు చాలా స్పేస్ ఇచ్చి ప్రచురించింది. 

మరి ఇందులో ఏముందంటే.. విలువల గురించి రఘువీర జగన్ కు ఒక లెక్చరిచ్చాడు. బ్రహ్మాండమైన లాజిక్ లు మాట్లాడాడు. అంతిమంగా రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ కు మద్దతు పలకాలని రఘువీర డిమాండ్ చేశాడు. మరి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కావాలంటే అడిగే పద్ధతి ఇదికాదు. అడుక్కోవాలి కానీ ఆర్డర్ వేయకూడదు.. ఈ విషయాన్ని మరిచి రఘువీర రెచ్చిపోయిన వైనం ఆసక్తికరంగా ఉంది. 

అవతల అమిత్ షా వంటివాళ్లే జగన్ కు ఫోన్ చేసి సున్నితంగా మద్దతును అడుగుతుంటే.. రఘువీరా రెడ్డి మాత్రం వీరలెవల్లో రెచ్చిపోయాడు. జగన్ కు ఎంతోమంది లౌకికవాదులు ఓట్లు వేశారని.. అలాంటి ఓట్లతో సీట్లు పొందిన జగన్ మతతత్వ ఎన్డీయే అభ్యర్థికి ఎలా మద్దతునిస్తాడు? అనేది రఘువీరారెడ్డి వేసిన ప్రశ్న. ఈ విధంగా జగన్ ఆ ఓటర్లకు ద్రోహం చేస్తున్నాడని రఘువీరారెడ్డి తెగ ఆవేదన వ్యక్తం చేశాడు. 

నిజమే.. ఈ లాజిక్ ను ఒప్పుకుందాం. జగన్ కు లౌకికవాద ఓటర్లు ఓట్లు వేశారు కాబట్టి, జగన్ మతతత్వ పార్టీకి మద్దతునివ్వకూడదు అని రఘువీర భాష్యం చెబుతున్నాడు. ఇక్కడ ఓటర్లకు లౌకికవాద ముద్ర, బీజేపీకి మతతత్వ ముద్ర వేయడం కాంగ్రెస్ లెక్క మాత్రమే. మరి కాంగ్రెస్ చేసింది ఏమిటి? ఏపీలో సీట్లను పొంది రాష్ట్రాన్ని విభజించింది కదా? ఆరోజు కాంగ్రెస్ కు, రఘువీరకు ఈ లాజిక్ గుర్తుకు రాలేదా అని? సీమాంధ్ర ప్రాంతం కోరని విభజనను కాంగ్రెస్ చేసింది. 

అది కూడా సీమాంధ్ర నుంచి సంక్రమించిన బలంతోనే కదా? కాదా? ఏపీ విభజన బిల్లును కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో, రాజ్యసభలో గట్టెక్కించగలిగింది అంటే.. అది సీమాంధ్ర నుంచి లభించిన ఎంపీల, రాజ్యసభ సభ్యుల బలంతో కాదా? ఇప్పుడు జగన్ లౌకికవాద ఓట్లను తీసుకెళ్లి ఎన్డీయేలో కలుపుతున్నాడు అంటూ తెగ బాధపడిపోతున్న రఘువీర కొన్ని ప్రాథమిక విషయాలను మరిచాడా? రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ బలం బీజేపీకి అవసరమే లేదు.. జగన్ రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించలేడు, ఓడించలేడు. 

ఆఖరికి కాంగ్రెస్ కే ఆ శక్తి లేదు కదా. ఇప్పుడు ఓట్ల గురించి మాట్లాడుతున్న రఘువీరారెడ్డి రాష్ట్ర విభజన అంశాన్ని గుర్తు చేస్తున్నాడు. సీమాంధ్రలో ఎంపీల బలాన్ని, సీమాంధ్ర ఓట్ల ద్వారా ఏపీలో అధికారాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీ చేసి పాపాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షుడే గుర్తు చేస్తున్నాడు. మరి సీమాంధ్ర ప్రజల ఓట్లను పొంది, వాళ్లకు శాశ్వతంగా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయాన్ని రఘువీరారెడ్డి తన వాదనతోనే గుర్తు చేస్తున్నాడు నిస్సిగ్గుగా!

Show comments