బీజేపీ ర్యాగింగ్‌కి టీడీపీ విలవిల.!

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. సమాధానం దొరికేదాకా.. ఈ ప్రశ్న చుట్టూ చాలా రచ్చ జరిగింది. కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌ పుట్టుకొచ్చాయి. ఓ సినిమాలో ఓ సన్నివేశం చుట్టూ ఇంత సస్పెన్స్‌ నెలకొనడం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీకీ ఓ 'చిక్కుముడి' లాంటి ప్రశ్న వచ్చిపడింది. నరేంద్రమోడీ - జగన్‌కి ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.? అన్నదే ఆ ప్రశ్న. 

ఇందులో వింతేముంది.? ఓ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత, ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరారు, దొరికింది. దాంతో, నరేంద్రమోడీని జగన్‌ కలిశారు.. అన్నది బీజేపీ వెర్షన్‌. కానీ, అలా జరగకూడదంటోంది తెలుగుదేశం పార్టీ. ఆర్థిక ఉగ్రవాదికి, ప్రధాని ఎలా అపాయింట్‌మెంట్‌ ఇస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. 'నాన్సెన్స్‌, జగన్‌ ఇంకా నిందితుడు మాత్రమే.. దోషి అని మీరెలా డిక్లేర్‌ చేస్తారు.?' అని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. 

బీజేపీ నుంచి ఈ స్థాయి ర్యాగింగ్‌ని టీడీపీ అస్సలేమాత్రం ఊహించలేదు. అందుకే, విలవిల్లాడిపోతోంది. జగన్‌, మోడీని కలిసినందుకు కాదు.. ఆ భేటీని బీజేపీ సమర్థించుకుంటున్నందుకు టీడీపీకి ఎక్కడో 'కాలి'పోతోంది. కానీ, ఏం చేయలేని పరిస్థితి. బీజేపీ ర్యాగింగ్‌ వెనుక ఉద్దేశ్యమేంటో తెలియక, టీడీపీ నేతలు గింజుకుంటున్నారు. మరోపక్క, పార్టీ అధినేత చంద్రబాబు, ఇండియాకి తిరిగొస్తే అన్ని విషయాలపైనా క్లారిటీ వస్తుందని టీడీపీ నేతలు అనుకుంటున్నారట. 

అంటే, ఇండియాకి వస్తూనే, చంద్రబాబు - వెంకయ్యనాయుడిని వెంటేసుకుని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపి, వీలైతే నరేంద్రమోడీతోనూ భేటీ అయి, ఈ మొత్తం వ్యవహారంపై స్పష్టత తీసుకోనున్నారన్నమాట. తప్పదు మరి, ఎన్డీయేలోంచి తమను వుంచారా.? పీకేశారా.? కొత్త మిత్రుడ్ని బీజేపీ వెతుక్కుంటోందా.? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడం వరకూ బాగానే వుందిగానీ, చిన్నపాటి పొలిటికల్‌ డెవలప్‌మెంట్‌కే ఇంతలా టీడీపీ కంగారుపడాలా.! 

Show comments