ఆ కథను వెనక్కు నెట్టిన ఫిదా

చేతి దాకా వచ్చింది నోటి దాకా రాకపోవడం అంటే ఇదే. ఎన్నాళ్లు గానో ఊరిస్తున్న డైరక్షన్ చాన్స్ వచ్చింది అనుకుంటే ఫిదా సినిమా వచ్చి దాన్ని వెనక్కు నెట్టింది. దాంతో సౌజన్య అనే మహిళా దర్శకురాలికి సినిమా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అసలు సంగతి ఏమిటంటే కృష్ణవంశీ, ఇంకా మరి కొంత మంది దగ్గర అసోసియేట్ గా పనిచేసిన సౌజన్య అనే మహిళా దర్శకురాలు ఓ మాంచి కథ తయారు చేసుకున్నారు. 

అది హారిక హాసిని బ్యానర్ వాళ్లకు బాగా నచ్చేసింది. నాగ్ చైతన్యకు చెప్పించారు. మంచి కథ కదా అని ఓకె అన్నాడు. కట్ చేస్తే, ఇంతలో ఫిదా సినిమా విడుదలయింది. తీరాచూస్తే, ఈ కథకు ఫిదాకు కాస్త సిమిలారిటీలు కనిపించాయి. పైగా ఈ కథకు ఫిదా మాదిరిగానే మాంచి పెర్ ఫార్మెన్స్ చేయగలిగిన హీరోయిన్ కావాలి. సాయి పల్లవినే తీసుకుంటే, మళ్లీ ఫిదాను చూసి, అలాంటి సినిమా తీసారన్న మాట వస్తుంది. దాంతో తాత్కాలికంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసారు. దీనికి బదులు మరో ప్రాజెక్టుకు నాగ్ చైతన్య ఓకె చెప్పేసాడు. పాపం, మరి ఆమె రాసుకున్న ఆ కథ ఎప్పుడు సినిమా తెరమీదకు చేరుతుందో?

Show comments