డిసెంబర్‌ 31న 'మోడీ' కొత్త బాంబ్‌.!

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకోసం ఉత్సాహంగా సమాయత్తమవుతున్నారా.? అయితే, కాస్సేపు ఆగండి. డిసెంబర్‌ 31 వరకూ వేచి చూడండి. ఎందుకంటే, ఆరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ 'కొత్త బాంబు' పేల్చనున్నారు. ఆ 'బాంబు' సంగతేంటి.? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. 

నవంబర్‌ 8న ప్రధాని నరేంద్రమోడీ పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి, దేశంలో పెద్ద సంక్షోభానికే తెరలేపారు. ఇది గతంలో ఎప్పుడూ ఎవరూ చూడని సంక్షోభం. అప్పటినుంచీ, ఇప్పటిదాకా దేశంలో కరెన్సీ సంక్షోభం రోజురోజుకీ తీవ్రమవుతోంది తప్ప, సద్దుమణగడంలేదు. డిసెంబర్‌ 30వ తేదీతో నరేంద్రమోడీ ఈ సంక్షోభానికి పెట్టిన గడువు పూర్తి కానుంది. మామూలుగా, ఏదన్నా సంక్షోభం పాలకులు సృష్టిస్తే, దాన్నుంచి జనాన్ని బయటపడేసేందుకు తగిన చర్యలు చేపట్టాలి. కానీ, కేంద్రం చేతులు ముడుచుక్కూర్చుందంతే. సింపుల్‌గా చెప్పాలంటే, సంక్షోభం సృష్టించి, చోద్యం చూస్తోంది. పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం అంటే ఇదే మరి.! 

డిసెంబర్‌ 31న ప్రధాని మీడియా ముందుకొచ్చి, దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారనే సంకేతాలు కేంద్రం నుంచి అందుతున్న దరిమిలా, ఈసారి మోడీ ఎలాంటి బాంబు పేల్చనున్నారోనని దేశమంతా ఆందోళన చెందుతోంది. అయినా, నిండా మునిగినోడికి చలేంటి.? అన్న వాదనా లేకపోలేదు. త్వరలో ప్లాస్టిక్‌ కరెన్సీని తీసుకొస్తామని ఇటీవల కేంద్రం, పార్లమెంటులో పేర్కొంది. బహుశా, దానికి సంబంధించిన కీలక ప్రకటన నరేంద్రమోడీ నుంచి రాబోతోందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలే నిజమైతే, ప్రస్తుత కరెన్సీ మాటేమిటి.? ఇది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

ఇలా చెయ్యకూడదు, అలా చేసి వుంటే బావుండేదనుకోడానికి.. అక్కడ జరుగుతున్నది పూర్తిగా 'తుగ్లక్‌' పాలన. సో, ఏం జరిగినాసరే, భరించాల్సిందే.. ఇంకో మార్గం లేదు. గెట్‌ రెడీ ఫర్‌ డిసెంబర్‌ 31 బాంబ్‌.. అంతే.!

Show comments