ఇంకెంతమంది చచ్చిపోవాలో.?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంకా ఆసుపత్రిలోనే వున్నారు. నెల రోజులకు పైగా ఆమె జైల్లో చికిత్స పొందుతూనే వున్నారు. ఆ చికిత్స ఏమిటి.? చికిత్సకు ఆమె ఎలా స్పందిస్తున్నారు.? అసలు ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమన్నా మెరుగుపడిందా.? వంటివన్నీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి తప్ప, అమ్మ దర్శన భాగ్యం మాత్రం తమిళనాడు ప్రజలకు కలగడంలేదు. 

ఈలోగా 'అమ్మ' అభిమానులు తొందరపడుతున్నారు.. కొందరు ఆత్మహత్య చేసుకుంటోంటే, ఇంకొందరు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. వివిధ కారణాలతో.. అంటే, అమ్మకోసం పూజలు, పునస్కారాలు చేయడం, ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తి మృత్యువాత పడటం అన్నమాట. మన దేశంలో నాయకుల కోసం సాధారణ ప్రజానీకం ప్రాణాలు కోల్పోవడం అనేది కొత్త విషయం కాదు. నాయకుడంటే ముందుండి, ప్రజల్ని నడిపించేవాడు. 

'తొలి తూటా నాకే తగలాలి.. తొలి లాఠీ దెబ్బ నాకే తగలాలి..' అని ఉద్యమంలో ప్రజల్ని ఉర్రూతలూగించే ప్రసంగాలు చేయడం తప్ప, ఉద్యమంలో లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలు నిజంగానే ఎదుర్కొనే నాయకులు మనకు కన్పించరు. ఉద్యమాల సంగతి పక్కన పెడితే, అమ్మ ఆరోగ్యం కోసం జనం ప్రాణాలు కోల్పోవడం మాత్రం అత్యంత బాధాకరమైన విషయం. ఏం చేస్తారు, ఎన్ని రోజులైనా అమ్మ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రాకపోతే, గుండెల్లో గూడుకట్టుకున్న అభిమానం.. ఆ కారణంగా తీవ్ర మనోవేదన.. వెరసి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటుంటారు అభాగ్యులు. 

విదేశాల నుంచి డాక్టర్లు వస్తున్నారు.. వెళుతున్నారు. నాయకులు పరామర్శిస్తున్నారు, అమ్మ క్షేమమని చెబుతున్నారు. అతి త్వరలో డిశ్చార్జ్‌.. అని చెప్పడం తప్ప, ఆ అతి త్వరలో ఎప్పుడన్నది మాత్రం తేలడంలేదు. జయలలిత మాట్లాడుతున్నారన్నది డాక్టర్లు చెబుతున్న మాట. సింపుల్‌గా ఓ వీడియో బైట్‌, తాను క్షేమంగా వున్నానని అమ్మతో ఆ డాక్టర్లు ఇప్పించేస్తే మేటర్‌ క్లియర్‌ కదా.! 

జనం ప్రాణాలు పోతున్న దరిమిలా, ఈ చిన్నపాటి క్లారిటీ కూడా జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి నుంచి రాకపోవడం శోచనీయమే. అమ్మ కోసం ప్రాణాలు కోల్పోతున్నారు.. అమ్మ ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేసినోళ్ళంతా జైలుకు పోతున్నారు.. కానీ, ఆ అమ్మ మాత్రం అపోలో ఆసుపత్రి నుంచి బయటకు రావడంలేదాయె. ఆమె కాదు, ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత కూడా అపోలో గడపదాటి బయటకు రాకపోవడాన్ని ఏమనుకోవాలి.?

Show comments