మోడీ గుప్పిట్లో ఇద్దరు చంద్రులు.!

'రండి బాబూ రండి.. ఆలసించిన ఆశాభంగం.. నాలుగేళ్ళపాటు అధికారం.. ఆ తర్వాత కావాలనుకున్న నియోజకవర్గం నుంచి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా టిక్కెట్‌.. ఈలోగా నియోజకవర్గాలకి నిధులు, వీలుంటే మంత్రి పదవులు.. ' అంటూ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పార్టీ ఫిరాయింపుల కోసం నీతి నియమాల్ని పక్కన పెట్టేసి, నైతిక విలువలకు తిలోదకాలిచ్చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేసి మరీ ప్రత్యర్థి పార్టీల్లోంచి ఎమ్మెల్యేలు, ఎంపీల్ని లాగేసుకున్నారు. 

'తావీజ్‌ మహిమ.. 2019 ఎన్నికల సమయానికి నియోజకవర్గాల పెంపు జరిగిపోతుంది.. అది విభజన చట్టంలో వున్నదే..' అంటూ అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్‌.. వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిథులకి మాయమాటలు చెప్పేశారు. కానీ సీన్‌ సితారైపోయింది. నియోజకవర్గాల పెంపు కష్టసాధ్యమనీ, రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో నియోజకవర్గాలు పెరగవని టీడీపీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చింది. 

పరిపాలన చెయ్యండయ్యా.. అని ప్రజలు అధికారమిస్తే, పరిపాలనను గాలికొదిలేసి రాజకీయాల్లో అసలంటూ ప్రత్యర్థులే లేకుండా చెయ్యాలనే కుట్ర పన్నారు ఇద్దరు చంద్రులు. చిత్రంగా నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఇద్దరి పేర్లలో చంద్రుడు వున్నట్లే, ఇద్దరిలోనూ రాజకీయ వ్యూహాలు రచించే కుయుక్తులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయినా, తెలంగాణలో అయినా అధికారంలో వున్న పార్టీలకు ఇతర పార్టీల్లోంచి నేతల్ని లాక్కోవాల్సిన అవసరం లేదు. కానీ, వారికి అభద్రతాభావం చాలానే వుంది. ప్రత్యర్థిని నిర్వీర్యం చేస్తే తప్ప రాజకీయాల్లో మనుగడ సాధించలేమన్న భయం ఇద్దరు చంద్రుల్నీ వెంటాడింది. 

ఇక, కేంద్రం ఇద్దరు చంద్రుల వీక్‌ పాయింట్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రధాని నరేంద్రమోడీ, విభజన చట్టంలో వున్న నియోజకవర్గాల పెంపు అంశాన్ని లైట్‌ తీసుకున్నారు. కుంటి సాకులు చెబుతూ, ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు కుదరదని చెప్పించేశారు. అలాగని, ఇక్కడితో ఈ ఎపిసోడ్‌ ముగిసిపోయిందనుకోడానికి వీల్లేదు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చిత్తశుద్ధి చూపించరుగానీ, నియోజకవర్గాల పెంపు కోసం ఏ స్థాయికైనా వెళ్ళి పోరాటం చేయడానికి ఇద్దరు చంద్రులూ ఒకరితో ఒకరు పోటీ పడతారు, అవసరమైతే ఒకరితో ఒకరు జతకట్టేస్తారు. 

ముందు ముందు జరగబోయేది అదే. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపుగానీ, ముగిశాకగానీ.. ఇద్దరు చంద్రులూ ఢిల్లీకి వెళ్ళి, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతారట.. నియోజకవర్గాల పెంపు గురించే లెండి. ఇంకా నయ్యం.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నెలకొన్న ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం అనుకునేరు.? అంత చిత్తశుద్ధి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకూ వుంటే తెలుగు రాష్ట్రాలు ఎప్పుడో బాగుపడిపోయేవి. ఎనీ డౌట్స్‌.?

Show comments