ఇన్ని వాయిదాలా.. వేచి చూపులే మిగిలాయ్!

‘బాబు వస్తే జాబు’ ఎన్నికల సమయంలో గోడల మీద రాసిన నినాదం. ఒక తనను తాను ఐటీ పితామహుడిగా బాబు అభివర్ణించుకొంటూ ఉండటం.. మరోవైపు ఇలాంటి నినాదాల వినిపిస్తుంటే ఏపీ సీఎంగా చంద్రబాబు ఉంటే, నిజంగానే ఉద్యోగాలకు కొదవే ఉండదని నేటి తరం భావించింది. అయితే 1995-2004ల మధ్య ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేసిన వారికి మాత్రం బాబు తీరు గురించి అనుభవాలున్నాయి.
వాళ్లకు కాదు కానీ.. ఈ తరానికి మాత్రం ఇప్పుడు అసలు విషయం అర్థం అవుతోంది. ‘బాబు వస్తే  జాబు వస్తుంది’ అనుకున్న వాళ్లకు అసలు కథ అనుభవంలోకి వస్తోంది.

రాష్ట్రంలోకి గత రెండున్నరేళ్లలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి, అవి ఎంతమందికి ఉపాధిని కల్పించాయి? అనే అంశాల గురించి చెప్పగలిగింది  రాష్ట్ర ప్రభుత్వమే. దీనికి సంబంధించి ఒక్క శ్వేత పత్రం విడుదల చేస్తే.. అప్పుడు స్పష్టత వస్తుంది. అనుకూల పత్రికల్లో అనునిత్యం ‘లక్షల ఉద్యోగాలు.. వేల కంపెనీలు..’ అంటూ ప్రకటనలు చేసుకోవడాన్ని పక్కన పెట్టి అసలు విషయాన్ని ప్రకటించే దమ్మూధైర్యం ప్రభుత్వానికి లేవు. ఐటీ మంత్రిని అడిగితే.. రాబోయే సంవత్సరాల కథ చెబుతారు కానీ, జరిగిన కథ గురించి ఆయన మాట్లాడరు.

ఇక ప్రభుత్వ ఉద్యోగాలు.. బాబు సీఎంగా ఉంటే ఏపీపీఎస్సీకి పెద్దగా పని ఉండదని నిన్నటి తరం నిరుద్యోగులకు తెలిసిందే. ప్రభుత్వ నియామకాలకు బాబు పూర్తిగా బ్యాన్ పెడతాడు అనేది వీరి మాట. 1995 నుంచి 2004ల మధ్య అనుభవాలతో వారు ఈ మాట చెబుతారు.

మరి అప్పటికి, ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ కనపడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశతో అప్పుడు ఒక తరం నష్టపోతే ఇప్పుడు మరో తరం నష్టపోతోంది. రెండున్నర సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ లేదు. గ్రూప్స్ నోటిఫికేషన్ పడుతుందని.. ఎన్నో లక్షల మంది ఎదురుచూస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో.. ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. గ్రూప్స్, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో-వీఏవో , అటవీ శాఖ ఉద్యోగాలు.. ఇలా ఏదో విధంగా విద్యార్ధులకు ఆశలను కల్పించాడు, చదువులతో వాళ్లను బిజిగా ఉంచాడు, చాలా మంది ఆ దశలో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించుకున్నారు.

అయితే బాబు హయాంలో నోటిఫికేషన్ వచ్చే సరికే పుణ్యకాలం కాస్తా పూర్తి అయ్యేలా ఉంది. జూన్ లో పడుతుందన్నారు, జూలైలో ఖాయం అన్నారు.. ఆగస్టులో ఎటు తిరికీ గ్రూప్స్ నోటిఫికేషన్ అన్నారు.. నవంబర్ వచ్చేసినట్టే! ఇప్పుడు మళ్లీ ఏజ్ లిమిట్ విషయంలో తర్జనభర్జనలు అట! ఈ విషయంలో చంద్రన్న విజన్ ఒక కొలిక్కి రావడం లేదట! మరి అదెప్పటికి తేలేనో! కొన్ని లక్షల మందికి వేచి చూస్తున్నారు. ఈ వాయిదాలతో అలాంటి వారందరికీ ఆ వేదనలే మిగిలాయి.

Show comments