బాలయ్యకి అది తెలియదట.!

మేనల్లుడికి మంత్రి పదవి దక్కబోతోందని మేనమామకి తెలియకుండా వుంటుందా.? 'ఏమో, నాకు ఆ విషయం తెలియదు' అంటూ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అమరావతిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసిన వాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. లోకేష్ మంత్రి అవుతున్నారట కదా.. అని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా సంధించిన ప్రశ్నలకు బాలయ్య పై విధంగా స్పందించారు. బాలయ్యకు చంద్రబాబు, లోకేష్ సమాచారమివ్వలేదా.? బాలయ్యతో అసలు ఆ విషయమే వారు చర్చించలేదా.? అదెలా సాధ్యమట.! తెలియక కాదుగానీ, బాలయ్య డిప్లమాటిక్‌గా మాట్లాడారనుకోవాలంతే. 

నారా లోకేష్‌కి మంత్రి పదవి ఖరారయ్యింది. ఐటీ శాఖను ఆయనకు కట్టబెడ్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ముందు మంత్రి పదవిపై గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశాకే, ఎమ్మెల్సీగా ఆయన్ని శాసనమండలికి పంపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పుత్రరత్నానికి మంత్రి పదవి కట్టబెట్టేందుకు చంద్రబాబు చాలా ఈక్వేషన్స్‌ ఫాలో అయ్యారనుకోండి.. అది వేరే విషయం. 'బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే..' అనే డిమాండ్లు వచ్చినా, అవి పక్కన పెట్టి, లోకేష్‌కి మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు చంద్రబాబు. 

ఇక, కొత్త అసెంబ్లీలో పాలక - ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలనీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో విలువైన సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలనీ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. పార్టీ కోసం లోకేష్‌ చాలా కృషి చేశారనీ, అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం సబబేననీ మేనల్లుడికి ఎమ్మెల్సీ పదవి విషయమై బాలకృష్ణ స్పందించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు లోకేష్‌ కూడా, అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.

Show comments