కోర్టు గడప తొక్కకుండా.. హోదాపోరు కుదరదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం అనేది, ప్రజల్లో వ్యక్తం అవుతున్న ఆకాంక్ష. ఈ విషయంలో ప్రభుత్వం ఎన్నిరకాల మాయమాటలతో ప్రజలను మబ్బులో ఉంచాలని చూసినా ప్రయోజనం దక్కేలా కనిపించడం లేదు. నిన్నటికి నిన్న యువతరం పిలుపు ఇచ్చిన ఆర్‌కె బీచ్ మౌన నిరసనను, వైసీపీ పిలుపు ఇచ్చిన కొవ్వొత్తుల ప్రదర్శనలను ప్రభుత్వం పోలీసు మూకలతో అమానుషంగా అణచివేసి ఉండవచ్చు గాక.. కానీ.. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆకాంక్ష ను వాళ్లు సమూలంగా తొక్కేయలేకపోతున్నారు. ప్రత్యేకహోదాకోసం ఈనెల 9 నుంచి 12 వరకు ఆర్‌కె బీచ్ లోనే దీక్షలు చేయాలని ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రకటించారు. అయితే హోదా గురించి  ఏ చిన్న దీక్ష జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వం అనుసరిస్తున్న దమననీతిని బట్టి చూస్తోంటే ఈ దీక్షలకు కూడా అనుమతి దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీక్ష చేయదలచుకుంటున్న వారు.. ముందస్తుగానే హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప మౌన నిరసనలకు కూడా అనుమతి దక్కే అవకాశం కనిపించడం లేదు. 

ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఈ దీక్ష, నిరసన, ఉద్యమం అయినా సరే.. ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం దానిని రాజద్రోహం కింద పరిగణిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీక్షాధారుల మీద దేశద్రోహ కేసులు పెట్టడం ఒక్కటే తక్కువ.. అంతకు తక్కువ కాని రీతిలో మొన్నటికి దారుణంగా అణచివేశారు. అంత గందరగోళంలోనూ.. హోదా సాధన సమితి సారథి చలసాని శ్రీనివాస్ తదితరులు నాలుగు పడవల్లో విశాఖ సముద్ర తీరానికి చేరుకుని అక్కడ ఆర్ కె బీచ్ లో కాసేపు నిరసనలు ప్రకటించి.. అరెస్టయ్యారు. ఇప్పుడు అదే హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నాలుగురోజుల దీక్షకు పిలుపు ఇచ్చారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం హోదా అనే మాట వినిపిస్తే చాలు ఉలికిపడుతున్న తరుణంలో ఈ నాలుగురోజుల దీక్షలకు పోలీసులు అనుమతి ఇస్తారనుకోవడం భ్రమ. పైగా పోలీసులు వ్యూహాత్మకంగా చివరి నిమిషం వరకు అనుమతుల విషయంలో ఇస్తామో లేదో కూడా తేల్చకుండా చివరి క్షణాల్లో కుదరదు అని తేల్చిచెప్పేసే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల.. పోలీసులు హోదా సాధన సమితి ముందుగానే హైకోర్టును ఆశ్రయించి.. తాము చేపట్టే శాంతియుత నిరసన దీక్షలకు అనుమతులు వచ్చేలా పోలీసులకు ఆదేశాలు ఇప్పించుకుంటే తప్ప.. ఈ దీక్ష జరిగే అవకాశం కనిపించడం లేదు. దీక్ష మీద చిత్తశుద్ధి ఉంటే.. పోలీసు అనుమతుల సంగతి తేల్చుకుని వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప.. కార్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు. 

హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఎంత మేరకు మద్దతిస్తాయనేది కూడా కీలకమైన అంశమే. తాము 26నే దీక్షలు చేశాం గనుక.. ఈ సాధన సమితి దీక్షలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీలు భావిస్తే.. ఖచ్చితంగా స్పందన తక్కువగానే ఉంటుంది. అయితే సాధన సమితి సారథులు, చలసాని శ్రీనివాస్ వంటి వారు కూడా.. భేషజాలకు పోకుండా అన్ని రాజకీయ పార్టీలను కలిసి తాము సంకల్పించిన దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాలి. కలసికట్టుగా పోరాడడానికి ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తేనే దీక్ష సఫలం అయ్యే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. 

Show comments