నా డప్పు మీరు కొట్టండి అంటున్న చంద్రబాబు!

''ఇక్కడ ఎవడి డప్పు వాడే కొట్టు కోవాలెహె!'' అనేది గబ్బర్‌సింగ్‌ చెప్పే నీతి. ఆ డప్పు కొట్టుకోవడంలో మన రాజకీయ నాయకులు ఎప్పుడూ చాలా ముందంజలో ఉంటారు. పాపం అధికారంలో ఉండే వారికి ఈ బాధ్యతలు మరీ ఎక్కువ. తాము ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నట్లుగా వారు పదేపదే డప్పు కొట్టుకోవాల్సి వస్తుంటుంది. అయినా మోడీ కల్చర్‌ వచ్చిన తర్వాత.. అందరికీ సాంకేతికంగా కూడా ముందంజలో ఉంటూ సదా తమ డప్పు కొట్టుకోవడంలో కొత్తపుంతలు తొక్కడం కూడా తెలిసి వచ్చింది. ఏపీలోని చంద్రబాబు సర్కారు కూడా ఆ విషయంలో తక్కువ తిన్లేదు. పబ్లిసిటీ ఇంపార్టెన్స్‌ను బాగా గుర్తించిన చంద్రబాబు, ఆయన బాటలో మంత్రులు ఆ పనిని బాగానే చేస్తుంటారు. 

అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక కూడా ఉంది. ఎవరి డప్పు వారు కొట్టుకోవడానికే వారి ఫోకస్‌ ఉంటుంది. అయితే ప్రస్తుతం చైనా పర్యటన ముగించి వచ్చిన చంద్రబాబు తన డప్పు కూడా మంత్రులే కొట్టాలని పురమాయిస్తున్నారట. 

చైనాలో చంద్రబాబునాయుడు బృందం విపరీతంగా పెట్టుబడుల ఒప్పందాలు కుదిర్చేసుకున్నట్లుగా అనేక వార్తలు వచ్చాయి. వాటి గురించి మీడియాలో రావాల్సినంత ప్రచారం వస్తూనే ఉంది. అయితే చంద్రబాబు.. మంత్రులతో చైనా నుంచి మాట్లాడుతూ.. తాను కుదుర్చుకుంటున్న ఒప్పందాల గురించి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెబుతున్నారట. సర్కారు ప్రస్తుతానికి చేసుకుంటున్నది ఎంఓయూలు మాత్రమే! అక్కడికే చైనా కంపెనీలు వచ్చేస్తున్నట్లుగా... జిల్లా యాత్రల్లో ఉండే మంత్రులు ప్రతిచోటా ప్రెస్‌మీట్‌లు పెట్టి చెప్పాలని చంద్రబాబు అంటున్నారట. 

బాబు డైరక్షన్‌ మేరకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆ బాధ్యత పూర్తిచేశారు కూడా! అనంతపురంలో ప్రెస్‌మీట్‌ పెట్టి చైనా ఒప్పందాలను ఒక రేంజిలో కీర్తించారు. ఇదే ఆదేశం అందుకున్న మరో మంత్రి ఎలా పొగడాలో తెలియక చాలా కన్ఫ్యూజ్‌ అయిపోయారట. దొనకొండలో వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ వస్తుందని చైనా ఒప్పందాల పేరిట వార్తలు వచ్చాయి. దీన్ని గురించి కీర్తించాల్సిందిగా ఆ ప్రాంతానికి చెందిన ఒక మంత్రికి చెప్పారుట. 

అయితే ఆయనకు అసలు వివరాలేమీ తెలియక.. ఓ ఉన్నతాధికారికి ఫోను చేసి.. అసలు ఒప్పందాలు ఏం కుదిరాయి? ఏం కంపెనీలు వస్తాయి? ఎప్పటికి వస్తాయి? ఎంతమందికి ఉద్యోగాలు రావొచ్చు? అసలు కంపెనీలు రావడం గ్యారంటీయేనా? అంటూ తనకున్న అనుమానాలన్నీ బయటపెట్టారుట. చంద్రబాబుకు మితిమీరిన ప్రచారం అంటే ఇష్టం ఉండడం సహజమే గానీ, ప్రజల్లో తిరుగుతూ ఉండే మంత్రులు ఈ ఒప్పందాలను కీర్తిస్తే ఇరుకున పడతారని పలువురు అంటున్నారు 

చైనా నుంచి మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నారని, ఆ రకంగా దేశం విడిచి వెళ్లినా కూడా రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు తపించి పోతున్నారని ఒక ప్రచారం ఉంది. అయితే పైన చెప్పుకున్న పురమాయింపుల గురించి తెలుసుకుంటున్న వారు.. చైనా నుంచి మంత్రులతో చంద్రబాబు చేస్తున్న సమీక్ష అంటే ఇదేనా.. తన గురించి, యాత్ర గురించి కీర్తించమని ఆదేశించడమేనా..? అని ముక్కున వేలేసుకుంటున్నారు. 

Show comments