జనన మరణాలేంటి గురూజీ

ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌ వర్మ శకం ముగిసింది. కొన్నాళ్ళుగా ట్విట్టర్‌లో వర్మ సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమాలకంటే ఎక్కువగా వర్మ, ట్విట్టర్‌ మీదనే ఆధారపడ్డాడు. ఎప్పుడూ ఎవరో ఒకర్ని కెలకడం, కెలికించుకోవడం.. ఇది వర్మకి బాగా అలవాటు. అలా వర్మ, సినీ జనాల మీదో, రాజకీయ ప్రముఖుల మీదనో, వీళ్ళెవరూ కుదరకపోతే దేవుళ్ళ మీదనో 'ట్వీట్లు' వేయడం, అవి కాస్తా వివాదాస్పదమవడం, వ్యవహారం కేసుల దాకా వెళ్ళడం తెల్సిన విషయాలే. 

ఇకపై, వర్మ ట్విట్టర్‌ పనిచేయదు. ఇకనుంచి వర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే చెప్పాలనుకున్నది చెబుతాడు. అంటే, ట్విట్టర్‌లో వర్మ పురాణం ముగిసినా, ఇన్‌స్టాగ్రామ్‌ పురాణం షురూ అవుతుందన్నమాట. ఫొటోలు, వీడియోలు.. ఒకటేమిటి, ఇకపై వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో సృష్టించబోయే సంచలనాలు అన్నీ ఇన్నీ కావన్నమాట. 

నిన్ననే వర్మ ట్విట్టర్‌లో పెద్ద బాంబు పేల్చాడు. సాయంత్రం షాకింగ్‌ న్యూస్‌ చెబుతానన్నాడు. ఆ షాకింగ్‌ న్యూస్‌, వర్మ కొత్త ప్రయాణం 'వెబ్‌ సిరీస్‌' గురించి అని ఆ తర్వాత అందరికీ అర్థమయ్యింది. గన్స్‌ అండ్‌ థైస్‌ సీజన్‌-1 ట్రైలర్‌ని విడుదల చేశాడు వర్మ. అయితే అంతకు ముందు వర్మ షాకింగ్‌ న్యూస్‌ అనగానే, ట్విట్టర్‌ని వదిలేస్తున్నావా? అనే ప్రశ్నలు దూసుకొచ్చాయి. ఆ ప్రశ్నలే నిజమయ్యాయిప్పుడు. వర్మ, ట్విట్టర్‌ని వదిలేశాడు.

వర్మ ఏం చెప్పినా అందులో వెరైటీ కోణం కన్పిస్తుంది. తన మీద తానే సెటైర్లు వేసుకోవడం.. తనను తాను అంద విహీనుడిగా చెపకోవడం వర్మకే చెల్లుతుంది. ట్విట్టర్ వీడుతూ, 2009 లో జననం 2017లో మరణం అన్నట్టు వ్యాఖ్యనించడం వర్మకి కాక ఇంకెవరికి చెల్లుతుంది. అందుకే ఆయన రామ్ గోపాల్ వర్మ అయ్యారు మరి. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో ప్రముఖ దర్శకులు వర్మని ప్రేమతో గురూజీ.. అని పిలుచుకుంటుంటారు. ఆ గురూజీ ట్విట్టర్ పిట్ట నేటితో చనిపోయిందంతే. 

Show comments