90 కోట్లు.. పరువు పోద్ది మరి.!

కర్నాటకలో ఓ సినీ రాజకీయ ప్రముఖుడి వైద్యం కోసం జరిగిన ఖర్చు అప్పట్లో పెద్ద వివాదానికే కారణమయ్యింది. తాజాగా, తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత వైద్య ఖర్చులు వివాదాస్పదమవుతున్నాయి. సుమారు 90 కోట్ల దాకా జయలలిత వైద్యం కోసం ఖర్చు చేశారంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అయితే, 'అంత పెద్ద మొత్తంలో ఖర్చు జరగలేదు.. కానీ ఖర్చు ఎక్కువే అయ్యింది..' అని అధికారికంగా తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. 

జయలలితకు చికిత్స అందించింది ఆషామాషీ ఆసుపత్రి కాదు. సాధారణ అనారోగ్యంతో వెళితేనే, లక్షలు గుంజేస్తుందన్న ఆరోపణలు సదరు ఆసుపత్రి యాజమాన్యంపై వుంది మరి.! అలాంటిది, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 75 రోజులపాటు జయలలితకు ఆ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిందంటే, ఆ మాత్రం ఖర్చు జరిగి వుండొచ్చన్న వాదన తెరపైకి రావడంలో వింతేముంటుంది.? 

అయితే, ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యమంత్రి అయినాసరే, అంత పెద్దమొత్తంలో ప్రజాధనం వృధా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న సామాన్యుల్లో సహజంగానే కలుగుతుంది. 90 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కార్పొరేట్‌ ఆసుపత్రికి ధీటుగా, అత్యాధునిక హంగులున్న ఆసుపత్రి నిర్మించేసి, వందలాది, వేలాదిమందికి ఉచితంగా వైద్య చికిత్సను అందించొచ్చు. ఈ చర్చ జనబాహుళ్యంలో జరుగుతుండడంతోనే, 'అబ్బే అంత ఖర్చు జరగలేదు.. పైగా, ఆ ఆసుపత్రి డబ్బు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరలేదు..' అంటూ తమిళనాడు ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తప్పదు మరి, 90 కోట్ల ఖర్చు అంటే పరువు పోద్ది కదా.! 

Show comments