మోడీ చూసొచ్చి.. బాబును చూసి రమ్మన్నాడట!

ఇదేదో ఇరుగింటి.. పొరుగింటి వ్యవహారం లాగా ఉంది. ఎక్కడైనా దూర ప్రాంతానికి వెళ్లిన వారు.. అక్కడ అన్నీ బాగున్నాయి.. మీరు కూడా వెళ్లి చూసి రండి అని చెప్పినట్టుగా ప్రపంచ విహారిగా పేర్గాంచిన మోడీగారు తను చూసొచ్చిన విశేషాలను బాబుకు చెప్పి ఈయనను కూడా అక్కడకు వెళ్లి రమ్మన్నారంట! మోడీ చెప్పిన విశేషాలన్నీ విని ఉండబట్టలేక బాబుగారు ఇప్పుడు రష్యా, కిర్గిస్తాన్ ల పర్యటనకు వెళ్లనున్నాడట.

ఇది వరకే బాబుగారు ఒకసారి ఈ విషయాన్ని సెలవిచ్చారు. మోడీ వెళ్లి.. చూసి ఎంజాయ్ చేసిన కొన్ని దేశాలకు తనూ వెళ్ల బోతున్నాను అని అప్పుడెప్పుడో బాబుగారు చెప్పారు. ఇప్పుడు ఆ పర్యటన కార్యరూపం దాల్చనుందని తెలుస్తోంది. వచ్చే నెలలో రష్యా, కిర్గిస్తాన్లల బాబు పర్యటించనున్నాడట. అక్కడ అందమైన కట్టడాలు ఉన్నాయని, వాటిని చూసి రావాలని మోడీ చెప్పాడని అందుకే బాబు ఈ దేశాలకు తన మందీ మార్భలంతో యథాతథంగా ప్రత్యేక విమానంలో వెళ్ల బోతున్నాడని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

అయినా.. ఏ దేశంలో ఏయే ప్రత్యేకతలు ఉన్నాయో స్వయంగా ముఖ్యమంత్రిగారే చూసి.. అలాంటి వాటిని అమరావతిలోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించే .. ముచ్చటకు ముగింపు ఎప్పుడో అర్థం కావడం లేదు. ఏ దేశానికి వెళ్లినా.. ఆ దేశంలోని ప్రముఖ నగరం పేరు చెప్పి అమరావతిని దానిలా తీర్చుదిద్దుతామనే ప్రకటనలు వినీవినీ విసుగొస్తోంది. బీజింగ్, షాంగై , టోక్యో, సింగపూర్, పుత్రజయ, ఇస్తాంబుల్, లండన్..తదితర నగరాల పేర్లలన్నింటినీ బాబు వాడేశాడు.

ఆ మధ్య లండన్ వెళ్లి.. అక్కక ఉన్న ‘లండన్ ఐ’ ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. అదెప్పటికో కానీ.. ఆ మాత్రం ప్రకటనకు లండన్ వరకూ వెళ్లాలా?! అనేది సామాన్యుల బుర్రకు అంతుబట్టని విషయం. ఇప్పుడు రష్యా, కిర్గిస్తాన్ పర్యటన విషయంలో కూడా అలాంటి సిల్లీ రీజనే చెప్పారు. మోడీ చూసి వచ్చాడట.. బాబును చూసి రమ్మన్నాడట.. అందుకు ట్రూపంతా బయలు దేరుతోందట! మొత్తానికి అటు దేశానికి.. ఇటు రాష్ట్రానికి మంచి పాలకులే దొరికారు. ప్రజల సొమ్ముతో ప్రపంచాన్ని చుట్టేస్తూ పొద్దు పుచ్చుతున్నారు. ఇంకా మూడేళ్ల వరకూ లైసెన్స్ ఉంది కదా! ప్రపంచంలో వీళ్లిద్దరూ వెళ్లని దేశాలేవైనా మిగులుతాయో లేదో చూడాలి. 

Show comments