సినిమా ఓకే.. రాజకీయం నాట్‌ ఓకే

సినిమా హీరోగా రజనీకాంత్‌ని ఆదరిస్తాం, అక్కున చేర్చుకుంటాం. రజనీకాంత్‌ తమిళ సినీ నటుడైనందుకు గర్వపడ్తాం.. సినీ నటుడిగా రజనీకాంత్‌ సాధించే విజయాల్ని మా ఖాతాలో వేసుకుంటాం.. కానీ, రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తామంటే చూస్తూ ఊరుకోం.. రాజకీయం ఊసెత్తితే, రజనీకాంత్‌ కన్నడిగుడైపోతాడంతే.! 

'వెర్రి'కీ హద్దూ అదుపూ వుండాలి. ప్రపంచం కుగ్రామమైపోయిందిప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని. అమెరికా వెళుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. 'అమెరికా మాది..' అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నినదిస్తే, 'వాడో వెర్రి పుష్పం..' అనేస్తున్నాం. మరి, మనమేం చేస్తున్నాం.? కులం, మతం, ప్రాంతం పేరుతో పిచ్చిపట్టినవాళ్ళలా వ్యవహరిస్తున్నాం.! 

రజనీకాంత్‌ విషయంలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం, చూస్తూనే వున్నాం. సినీ నటుడిగా చిరంజీవి, తెలుగు ప్రేక్షకుల్ని అలరించినంతకాలం ఆయన మీద 'కుల ముద్ర' పడలేదు. ఎప్పుడైతే, చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారో, 'కాపు' ముద్ర పడిపోయిందాయన మీద. పవన్‌కళ్యాణ్‌ విషయంలో అయినా అంతే. స్వర్గీయ ఎన్టీఆర్‌ కూడా కాస్తో కూస్తో ఈ సెగ ఎదుర్కొన్నారుగానీ, అప్పట్లో ఇప్పుడున్నంత పైత్యం లేదు. 

చంద్రబాబుతో, కేసీఆర్‌ దోస్తీ కడతారు.! కానీ, నచ్చకపోతే చంద్రబాబు పార్టీ 'ఆంధ్రోళ్ళ' పార్టీ అయిపోతుంది. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ - టీడీపీ కలిసి పోటీ చేయడం సంగతేంటట.? అది అడగొద్దంతే. రాజకీయాలు ఇలాగే తగలడ్తాయి. జనాన్ని మరీ 'గొర్రెల మందలా' భావించే రాజకీయ నాయకులున్నన్నాళ్ళూ ఇదే పరిస్థితి. 

'నేను 43 ఏళ్ళుగా తమిళనాడులోనే వుంటున్నా.. ఇకపైనా ఇక్కడే వుంటా..' అంటూ వీరావేశంతో రజనీకాంత్‌ ప్రకటించేశారుగానీ, ఆయన దిష్టిబొమ్మలు తగలబడిపోతున్నాయిప్పుడు. 'నువ్వు ఇక్కడ వుంటే వుండొచ్చుగాక.. కానీ, నువ్వు తమిళుడివి కాలేవు.. నువ్వెప్పటికీ కన్నడిగుడివే..' అంటూ తమిళ సంఘాలు (వెర్రికి పరాకాష్ట) నినదించేస్తున్నాయి. 

కులం, మతం, ప్రాంతం.. అనే భావనతో ఎవరు ఎలాంటి వేషాలేసినా చెల్లిపోతోంది మన దేశంలో. అసలంటూ, రాజకీయానికి పునాది అదే కదా.! అందుకే, ప్రత్యర్థుల్ని భయభ్రాంతులకు గురిచేయడానికి, రాజకీయం ఇలా వెర్రితలలు వేసేస్తోంటే, సోకాల్డ్‌ 'ఆందోళనకారులు' గొర్రెల మందల్లా మారిపోతుండడం శోచనీయం. 

Show comments