'శాతకర్ణి' సందడి షురూ.!

'ఖైదీ' సంబరాలొచ్చేశాయి.. 'శాతకర్ణి' సంబరాలు షురూ అవనున్నాయి. కాస్సేపట్లో 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా బెనిఫిట్‌ షోల కోసం రంగం సిద్ధమయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల 'ఖైదీ' సినిమా బెనిఫిట్‌ షోలకు అడ్డంకులు ఏర్పడినా, 'శాతకర్ణి' బెనిఫిట్‌ షోలకు మాత్రం పెద్దగా ఇబ్బందులేమీ లేవనే ప్రచారం జరుగుతోంది. 

ఇక, చిరంజీవికి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ఎంత ప్రతిష్టాత్మకమో, బాలకృష్ణకి 'గౌతమి పుత్ర శాతకర్ణి' కూడా అంతే. ఇద్దరూ 'అంతకు మించి..' అన్నట్టుగానే ఈ సంక్రాంతి బరిలో నిలిచారు. మెసేజ్‌తోకూడిన మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ని చిరంజీవి ఎంచుకుంటే, బాలకృష్ణ మాత్రం, వెరైటీ ప్రయోగమే చేశాడని చెప్పక తప్పదు. ట్రెయిలర్‌ దగ్గర్నుంచి 'శాతకర్ణి' సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేసిన దరిమిలా, రేపు ఓపెనింగ్స్‌ విషయంలో బాలయ్య దుమ్ము దులిపేయడం ఖాయమే. 

అయితే, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి మొదటి రోజు దొరికినన్ని థియేటర్లు, 'శాతకర్ణి'కి దొరకడం కష్టమే. చాలా చోట్ల మొత్తం థియేటర్లన్నిటిలోనూ 'ఖైదీ'ని తొలి రోజు ప్రదర్శించేశారు. 'ఖైదీ'కి ఈ వారాంతం వరకూ తిరుగు లేదు గనుక, ఫిక్సయిన థియేటర్లు కాకుండా, మిగతావాటిల్లో మేగ్జిమమ్‌ థియేటర్లలో 'శాతకర్ణి' సందడి చేయాల్సి వుంటుంది. 

ఏదిఏమైనా, సంక్రాంతి అంటే సగటు సినిమా అభిమానికి ప్రత్యేకమైన సినిమా పండగ. ఆ పండక్కి ఎన్ని సినిమాలొచ్చినా, అన్నిటికీ బ్రహ్మరథం పట్టేస్తాడన్నది నిర్వివాదాంశం. బాగుంది, బాగాలేదు.. అన్నది వారాంతం తర్వాతే కౌంట్‌ అవుతుంది. ప్రస్తుతానికైతే 'ఖైదీ'తో దాదాపు సమానంగా 'శాతకర్ణి' సందడి చేయనుండడం ఖాయమే. ఇంతకీ, 'శాతకర్ణి' సందడి ఎలా వుండబోతోంది.? అంచనాల్ని అందుకుంటుందా.? కాస్సేపట్లో ఫలితం తెలిసిపోతుంది.. అప్పటిదాకా సస్పెన్స్‌ తప్పదు.

Show comments