స్టార్ హీరోని.. నల్లధనికుడు అనేద్దామా!

ఒకవైపు కొంతమంది సినిమా వాళ్లేమో హ్యాట్సాఫ్ మోడీ, సర్జికల్ స్ట్రైక్స్, మోడీకీ జై.. అంటూ ట్వీట్లు పెడితే, నోట్ల మార్పిడి వ్యవహారంపై ఆచితూచి స్పందించాడు తమిళ స్టార్ హీరో విజయ్. నోట్ల మార్పిడిని స్వాగతిస్తూనే… ప్రణాళిక లేమి పట్ల విజయ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తగిన చర్యలు తీసుకుని.. ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఇరవై శాతం నల్లధనికులను కట్టడి చేయడం కోసం ఎనభై శాతం సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నారని విజయ్ అభిప్రాయపడ్డాడు. పటిష్టమైన చర్యలు లేకపోవడం వల్ల గ్రామీణులు, దినసరి కూలీలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని వాస్తవాలను ప్రస్తావించాడు విజయ్.

నల్లధనం ఎక్కువగా పేరుకుని ఉన్న రంగాల్లో సినీ రంగం ఒకటి. నటీనటుల రెమ్యూనరేషన్ ఒప్పందాలు, సినిమాల బడ్జెట్ , వసూళ్లు.. సర్వం నల్ల మార్కెట్ వ్యవహారాలే ఇక్కడ. సినిమాల్లో నీతులు చెప్పినా.. సదరు సినిమాల బడ్జెట్ ఎంత, హీరోల పారితోషకం, లాభం ఎంత, నష్టం ఎంత? అనే అంశాలు పారదర్శకంగా ఉండవు. ఇలాంటి ఇండస్ట్రీలో భాగమైన సినిమా వాళ్లు.. నల్లధనం అంశం గురించి పెడుతున్న ట్వీట్లు హాస్యాస్పదంగానే ఉంటున్నాయి. మోడీకి జై కొట్టేస్తే దేశభక్తులం అనిపించేసుకుంటామన్నట్టుగా వీళ్లు వ్యవహరిస్తున్నారు.

ఇలాంటి వారి మధ్యన విజయ్ వాస్తవాలను ప్రస్తావించాడు. గుడ్డిగా మోడీకి జై కొట్టేసి దేశభక్తుడు అనిపించేసుకోవడం కన్నా, 80 శాతం మంది ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ప్రస్తావించాడు. కాబట్టి.. ఇతడిని దేశ ద్రోహి, నల్ల ధనికుడు అనేస్తారేమో భక్తులంతా!

Show comments