ఇప్పటికే కాంగ్రెస్ ముక్త నినాదాన్ని ఇస్తోంది భారతీయ జనతా పార్టీ. దేశంలో కాంగ్రెస్ కు తావు లేకుండా చేస్తామని బీజేపీ వాళ్లు సవాళ్లు విసురుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగులుతున్న ఎదురుదెబ్బలు బీజేపీకి బోలెడంత ఆనందాన్ని ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని తాము ఓడించినా, వేరే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ను ఓడించినా.. బీజేపీ కి అమితానందమే! కేవలం ఎన్నికల ద్వారానే కాదు.. సామదానబేద దండోపాయాలన్నీ ఉపయోగించి మరీ కాంగ్రెస్ ను దెబ్బ తీయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అందుకు ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రంలో సంభవించిన పరిణామాలు రుజువులు.
మరి ఇలాంటి నేపథ్యంలో మరో రాష్ట్రంలో అంతర్గత కలహాలు కాంగ్రెస్ పీక మీదకు కత్తిని తీసుకొస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాస్తంత పెద్ద రాష్ట్రం అనిపించుకుంటున్న కర్ణాటకలో ఇప్పుడు లొల్లి మొదలైంది. సిద్ధరామయ్య చేపట్టిన మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ కాంగ్రెస్ లో కలహాలను తీవ్రస్థాయికి తీసుకెళ్లింది. పార్టీలోని పలువురు సీనియర్లను మంత్రి వర్గం నుంచి తప్పించడంతో ఆయా నేతలు తమ నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులపై దాడులు చేయించి మంటలు పెడుతున్నారు.
ఇప్పుడు సిద్ధరామయ్య క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కూడా ఉన్నాడు. పార్టీలో నిత్య అసంతృప్తుడు అయిన అంబరీష్ కు కర్ణాటక అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల తర్వాత మంత్రి పదవి లభించింది. ఇప్పుడు ఆ పదవి కూడా పోవడంతో అంబరీష్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. తను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అంబరీష్ పార్టీని బెదిరిస్తున్నాడు. కేవలం అంబరీష్ మాత్రమే కాదు.. మొత్తం ఎనిమిది మంది మంత్రులకు ఉద్వాసన పలికి అలజడి సృష్టించాడు సిద్ధరామయ్య.
ఇప్పటికే సిద్ధరామయ్య పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పుట్టిన అలజడి ఎంత వరకూ వెళుతుందో అనే భయాలు కలిగిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ. ఎలాగూ ఇక్కడ బీజేపీ బలంగానే ఉంది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటినా లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బీజేపీ పుంజుకుంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కర్ణాటక మీద దృష్టి నిలిపినట్టుగా తెలుస్తోంది.
ఇక్కడి పరిణామాల ఆధారంగా, కాంగ్రెస్ లోని అసంతృప్తులను ఆసరాగా చేసుకుని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ముమ్మరం అయినట్టు సమాచారం. ఏదో విధంగా ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలనకో, మధ్యంతర ఎన్నికలకో దారి తీయించాలనేది బీజేపీ వేస్తున్న లెక్క. ఎలాగూ గతంలో బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు.. కేంద్రంలోని యూపీఏ గవర్నమెంటు కర్ణాటకకు భరద్వాజను గవర్నర్ గా పెట్టి యడ్యూరప్ప గవర్నమెంటుతో ఒక ఆట ఆడుకుంది.
అప్పట్లో ఇక్కడ అధికారం ఉన్నా బీజేపీకి సంతృప్తి లేకుండా చేసింది కాంగ్రెస్ అధిష్టానం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ అధిష్టానం. మరి కర్ణాటక కూడా కాంగ్రెస్ చేతి నుంచి పోతుందా?