అందరి చూపు.... మంజునాథ కమీషన్‌ వైపు..!

కాపులకు బీసీలుగా గుర్తించే అంశంపై ఏర్పాటైన మంజునాథ కమీషన్‌ రాక కోసం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు, బీసీ సంఘాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఈనెల 22న మంజునాథ కమీషన్‌ తూర్పుగోదావరి జిల్లాకు రానుంది. దీంతో ఓవైపు కాపులు, మరోవైపు బీసీ కులాలు తమ కలాలకు పడును పెడుతున్నాయి. జిల్లాలోని కాపులు, బీసీలు తమ ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఎవరికి వారుగా వినతిపత్రాలు సిద్ధంచేసి కమీషన్‌కు ఇవ్వనున్నాయి. అలాగే కమీషన్‌ ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాలలో పెద్దఎత్తున తమకు న్యాయం చేయాల్సిందిగా కోలేందుకు కాపులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి కాపుల ఉద్యమానికి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన వేదికగా మారింది. జిల్లాకు చెందిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి నాయకత్వం వహిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం! ముద్రగడ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. 

తునిలో చెలరేగిన విద్వంసం మొదలుకొని ఏదో రూపంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోనే కాకుండా 13 జిల్లాల్లో ఉద్యమాన్ని చేపట్టేందుకు వీలుగా ముద్రగడ ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు జేఏసీని ఏర్పాటుచేశారు. జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో మంజునాథ కమీషన్‌ను కాపు నేతలు కలసి తమ డిమాండ్లను ఏకరువు పెడుతున్నారు. వాస్తవానికి కాపులకు ధీటుగా బీసీలు తమ బాణిని వినిపించాల్సి ఉన్నప్పటికీ వారి ప్రభావం కొన్ని చోట్ల అంతగా లేకపోవడం కాపులకు లాభిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో బీసీలు తమ వాణిని కమీషన్‌కు గట్టిగా వినిపించడం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంకేతాలు పంపేందుకు కృషి చేస్తున్నారు. ఇదిలావుంటే తూర్పు గోదావరి జిల్లాలో మంజునాథ కమీషన్‌ రెండు రోజులుంటుంది. ఒకరోజు కుల సంఘాల నుండి వినతిపత్రాలు స్వీకరించడం, మరోరోజు జిల్లాలో పర్యటించే విధంగా కమీషన్‌ షెడ్యూల్‌ ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో కమీషన్‌ పర్యటన రెండుసార్లు వాయిదాపడింది. ఈనెల 2వ తేదీన మంజూనాథ కమీషన్‌ పర్యాటించాల్సి ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో పర్యటన వాయిదా పడింది. 

గతంలో జిల్లాలో కమీషన్‌ ఒకరోజు మాత్రమే ఉంటుందని అందిన సమాచారం మేరకు ఓవైపు కాపు జేఏసీ, మరోవైపు బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వినతిపత్రాల స్వీకరణ నిమిత్తం కనీసం రెండు రోజులు ఉండాలని కోరారు. ఒకరోజు కాపులకు, మరోరోజు బీసీలకు తమ తమ వాదనలను వినిపించుకునే అవకాశం ఇవ్వాలని కోరాయి. ఒకేరోజు కాపు, బీసీలను సమావేశానికి పిలిచిన  పక్షంలో గొడవలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఇదిలావుండగా రాష్ట్ర కాపు జేఏసీ నేతలు, కమీషన్‌ జిల్లాకు రానున్న నేపథ్యంలో కనీసం రెండు రోజులుండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు వినతిపత్రాలు సమర్పించారు. వినతిపత్రాలను స్వీకరించేందుకు ఒకరోజే కేటాయించిన పక్షంలో ఒకపూట కాపుల నుండి, మరోపూట బీసీల నుండి స్వీకరించేలా చూడాలని కోరారు. రెండు రోజులు కేటాయించిన పక్షంలో ఒక్కొక్క రోజు వంతున కాపు, బీసీలకు కేటాయించాల్సిందిగా విన్నవించారు. జిల్లాలో తొలినుండి కాపులు, బీసీలందరూ అన్నదమ్ములుగా కలసిమెలసి ఉంటున్నామని, ఇటువంటి పరిస్థితుల్లో కమీషన్‌ రాకతో ఇరువర్గాల మధ్య ఘర్షణలకు పంతమాత్రం అస్కారం ఉండకూడదని కాపునేతలు పేర్కొంటున్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీకోసం నేడు కాపులు రోడ్డెక్కారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చిన చంద్రబాబు స్వార్థం కోసం కాపు, బీసీ కులాలు ఎందుకు శత్రువులుగా మారిపోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీసీ నేతలు తమ వాదన వినిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల ఓ కులానికి చెందిన కొందరు బీసీలు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు అనుకూలంగా వ్యవహరించడాన్ని బీసీ సంక్షేమ సంఘాలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా పంతో ఉన్నత స్థానంలో ఉన్న కాపులకు, కాపు జేఏసీకి అనుకూలంగా జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కొందరు బీసీ నేతలు మాట్లాడటం సమంజసంగా లేదని, ఇటువంటి చర్యల వలన కాపులకు మరింత లాభించే అవకాశాలున్నాయని వాపోతున్నారు. బీసీలు ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని గ్రహించి, కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన సాగించాలని బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.  Readmore!

అయితే కాపు జేఏసీ నేతలు ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. అసలు బీసీలుగా గుర్తించమని తాము అడగలేదని, గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబే తమకు హామీనిచ్చారని చెబుతున్నారు. అధికారం కోసం హామీనిచ్చి, తీరా ముఖ్యమంత్రి అయ్యాక తమను పట్టించుకోకుండా చంద్రబాబు అన్యాయం చేశారని, తమకు ఇచ్చిన హామీని మాత్రమే అమలుచేయాలని కోరుతున్నామని పేర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడచినా నేటికీ చంద్రబాబు తమను బీసీలుగా గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తమను బీసీలుగా గుర్తించని పక్షంలో 2019 ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.

Show comments

Related Stories :