జైట్లీ మాట విన్నాకా.. చెప్పండి: నల్లధనం ఎక్కడ?

నోట్ల రద్దు నిర్ణయానికి ముందు.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లెక్కల ప్రకారం, దేశంలో మారకంలో ఉన్న ఐదువందల, వెయ్యి రూపాయల నోట్ల మొత్తం విలువ 15.4 లక్షల కోట్లు! 

మారకంలోని ఐదువందల, వెయ్యి రూపాయల నోట్లు చెల్లవని మోడీ సంచలన ప్రకటన చేయడంతో.. ఆ మొత్తం అంతా నిర్వీర్యం అయ్యింది. ఆ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి, పరిమిత స్థాయిలో కొత్త నోట్లను తెచ్చుకోవాల్సింది భారతీయులు. అందుకు సంబంధించిన కష్టనష్టాలు, ఆ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతం అయిన తీరును, సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ఇన్నాళ్లూ చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు.. పాత నోట్ల డిపాజిట్ కు గడువు ముగిసింది. బ్యాంకుల్లో పాత నోట్ల ను తీసుకోవడం ఆగిపోయింది. పాత నోట్లను కలిగి ఉండటం నేరం కూడా. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖామాత్యులు అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి డిపాజిట్ల మొత్తం గురించి ఒక ప్రకటన చేశారు. భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఇస్తున్న సమాచారం ప్రకారం.. మారకంలోని ఐదువందల, వెయ్యి నోట్ల రద్దు నేపథ్యంలో.. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన ఆ నోట్ల మొత్తం విలువ.. 15 లక్షల కోట్లు!

డిసెంబర్ ముప్పై నాటికి రమారమీ ఈ మొత్తం జమ అయ్యింది! ఇక పాయింట్ ఫోర్ క్రోర్స్ విషయానికి వస్తే.. అందులో ఎన్ఆర్ఐ దగ్గర ఉన్న నోట్లు, దేవాలయాల హుండీల్లోని మొత్తం, పాత నోట్లను అపురూపంగా దాచుకున్న వారి దగ్గర మిగిలిపోయినవి, ఇప్పటికీ అవగాహన లేక.. పాత నోట్లను కలిగి ఉన్న వారి దగ్గర మిగిలిపోయినవి, ఇప్పటికీ.. ఆర్బీఐ వద్ద జమ అవుతున్నవి… వీటన్నింటినీ కలుపుకుంటే, ఆ నలభై వేల కోట్ల రూపాయలు ఉండటం ఏమంత కష్టం కాదు!

ఇప్పుడు మోడీ భక్తులు సమాధానం ఇస్తారా? మోడీనే సమాధానం ఇస్తారా? ఆర్బీఐ ఇస్తుందా? ఆర్థిక శాఖ మంత్రి సమాధానం ఇస్తారో తెలియదు కానీ.. అసలు.. నల్లధనం ఎక్కడా? అని! మారకంలో ఉండిన పెద్ద నోట్ల విలువ 15.4 లక్షల కోట్లు అన్నారు. జమ అయిన మొత్తాన్ని సరిగా లెక్కేస్తే.. ఇంతే విలువైన నోట్లన్నీ బ్యాంకులకు చేరాయి! 2.5 లక్షలకు మించి జమ చేసిన ప్రతి అకౌంట్ నూ డేగ కన్నుతో పరిశీలిస్తాం, ఆదాయానికిమించిన డిపాజిట్లు చేసిన వారిపై వందల రెట్లు  ఫైన్ వేస్తాం.. అంటూ ఎన్ని హెచ్చరికలు చేసినా ‘నల్లధనం’ గా వ్యవహరించబడిన మొత్తం కూడా ఎంచక్కా  బ్యాంకుల్లోకి చేరిపోయింది!

నిజంగానే నోట్ల రద్దుతో నల్లధనం బయటపడేదే అయితే.. మారకంలోని నోట్ల కు డిపాజిట్ అయిన నోట్లకు కొన్ని లక్షల కోట్ల రూపాయల తేడా ఉండాల్సింది! అయితే మారకంలో ఎంత ఉందో.. ఆ డబ్బు అంతా డిపాజిట్ అయిపోయిందని స్వయంగా విత్త మంత్రి సెలవిచ్చారు! తద్వారా నోట్ల రద్దుతో నల్లధనం బయటపడటం అనేది పూర్తి అబద్ధపు థియరీ అని స్పష్టం చేశారు!

దారుణం ఏమిటంటే.. దొంగనోట్లు కూడా బయటపడినట్టుగా లేవు! పాక్ లో తయారైన దొంగనోట్లు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి.. నోట్ల రద్దుతో అలాంటి నోట్లన్నీ బయటకు వస్తాయి అన్నారు.. కేంద్రమంత్రులు, మోడీ భక్తులు ఈ మాటలు చెప్పారు. అయితే.. జమ అయిన నోట్లలో దొంగ నోట్లు చెప్పుకోదగిన స్థాయిలో కూడా లేవు! ఏ బ్యాంక్ కూడా తమ వద్దకు ఇన్ని కోట్ల రూపాయల దొంగ నోట్లు వచ్చాయని కూడా ప్రకటించడం లేదు. ప్రతి నోట్ నూ చెక్ చేసే తీసుకున్నారు కదా.. అయినా దొంగ నోట్లు దొరకలేదా?

ఇదంతా చూస్తుంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీయడం, సామాన్యుడిని తీవ్రంగా ఇబ్బందుల పాల్జేయడం తప్ప.. నోట్ల రద్దు తో ఒరిగింది శూన్యం! ప్రభుత్వ, బ్యాంకుల గణాంకాలు చెబుతున్న సత్యం ఇది.

Show comments