పెట్టుబడిదార్లను భయపెట్టేస్తున్న చంద్రబాబు!

పని అయ్యే వరకు ఒక రకంగా మాయ మాటలు చెప్పడం.. పని పూర్తయిపోయిన తర్వాత.. ప్లేటు ఫిరాయించడం .. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబునాయుడు ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు లెక్కకకు మిక్కిలిగా ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కి.. జనాన్ని వంచించారని చంద్రబాబు మీద విమర్శలు ఉన్నాయి. 

ప్రజల విషయంలో ప్రతిసారీ పార్టీలు ఇలాగే చేస్తుంటాయి గానీ.. రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే.. దానికి ప్రాతిపదికగా ఉండే పెట్టుబడిదార్ల విషయంలో కూడా ఇలా చేస్తే ఎలా అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. ఉన్న నిబంధనలు ముందూ వెనుకా రాగల ఇబ్బందులూ చూసుకోకుండా చంద్రబాబు ఇచ్చేసిన హామీలు ఇప్పుడు తిరగబడుతున్నాయి. ఈ రాష్ట్రానికి వచ్చి తప్పు చేశామా అని పెట్టుబడిదార్లు భయపడే పరిస్థితిని చంద్రబాబునాయుడు కల్పించారని జనం అనుకుంటున్నారు.  

విషయం ఏంటంటే.. జపాన్‌కు చెందిన ఇసుజు వాహనాల కంపెనీని వరదయ్యపాళెం వద్ద గల శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఏపీలో వచ్చిన అతిపెద్ద కంపెనీ ఇది. అయితే ఈ యూనిట్‌ ఏర్పాటు సమయంలో.. వీరు రాష్ట్రంలో తయారుచేసే వాహనాలకు లైఫ్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చేస్తాం అంటూ చంద్రబాబునాయుడు చాలా ఆడంబరంగా వారికి మాట ఇచ్చారు. 

నిబంధనల ప్రకారం ఇది సాధ్యమవుతుందా లేదా ఆయన పట్టించుకోలేదు. పన్ను మినహాయింపు వస్తుంది గనుక.. ఆ యూనిట్‌ను మన రాష్ట్రంలోనే పెట్టారు. అయితే ఈ విషయంలో సర్కారు ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. ఇసుజు ప్రతినిధులతో అధికార్లు భేటీ అయి లైఫ్‌ ట్యాక్స్‌ మినహాయింపుకు నిబంధనలు ఒప్పుకోవని రాతపూర్వకంగా తేల్చిచెప్పేశారట. 

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా ఒక కంపెనీ వారి ఉత్పత్తులకు లైఫ్‌ ట్యాక్స్‌ మినహాయించిన దాఖలాలు లేవని చెప్పారుట. మరి.. అలాంటప్పుడు ముందూ వెనుకా చూసుకోకుండా చంద్రబాబు ఆరోజున అడ్డగోలు హామీలు ఎందుకు ఇచ్చినట్లు, పెట్టుబడిదారుల్ని అబద్ధాలతో ఎందుకు ఆకట్టుకున్నట్లు అనేది జనం ముందున్న సందేహం. 

ప్రజల్ని మాయమాటలతో మోసం చేసే తరహాలోనే, పెట్టుబడి దారులను కూడా ఏపీ ప్రభుత్వం ఇలా ఇస్తామన్న రాయితీలు ఇవ్వకుండా మోసం చేస్తుందనే సంగతి, పారిశ్రామికవేత్తలో ప్రచారం అయితే గనుక.. చంద్రబాబు ప్రత్యేక విమానాలు పెట్టుకుని మరో పది దేశాలు తిరిగినా సరే మన రాష్ట్రానికి పరిశ్రమలు మాత్రం రావని జనం భయపడుతున్నారు. 

Show comments