ప్రచార హోరులో బాలయ్యే టాప్‌

దాదాపు తొమ్మిదేళ్ళ విరామం తర్వాత చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా కావడంతో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫక్తు కమర్షియల్‌ సినిమా ఇది. అంతర్లీనంగా మంచి మెసేజ్‌ కూడా వుందనుకోండి.. అది వేరే విషయం. ఇది తమిళ 'కత్తి'కి రీమేక్‌. సోషల్‌ మీడియాలో విడుదల చేసిన ఆడియో సింగిల్స్‌కి మంచి రెస్పాన్స్‌ రావడం, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ సూపర్‌ సక్సెస్‌ అవడంతో మెగా కాంపౌండ్‌ ఫుల్‌ హ్యాపీగా వుంది. 

ఇక, హీరోగా బాలకృష్ణకి 'గౌతమి పుత్ర శాతకర్ణి' 100వ సినిమా. అంతే కాకుండా, తెలుగు చక్రవర్తి 'గౌతమి పుత్ర శాతకర్ణి' జీవిత గాధను సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్‌. ఇప్పటిదాకా ఎవరూ టచ్‌ చేయని చిత్రమిది. ట్రైలర్‌తో 'అహో అద్భుతం' అనే ప్రశంసలు అందుకుంది 'శాతకర్ణి'. సహజంగానే తెలుగువారందరికీ తమ చక్రవర్తి చరిత్ర ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి, పైగా బాలకృష్ణ 100వ సినిమా అన్న ఆసక్తి వుండడం, వీటన్నిటికీ తోడు సినిమాకి జరుగుతున్న పబ్లిసిటీ.. వెరసి 'శాతకర్ణి'పై హైప్‌ అలా ఇలా లేదు. 

సంక్రాంతికి రెండు కాదు, మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజైనా, ఏ సినిమాకీ క్రేజ్‌ తగ్గే పరిస్థితి లేదు. అయినాసరే, పబ్లిసిటీ పరంగా చూస్తే 'ఖైదీ' కాస్త వెనకబడినట్లే కన్పిస్తోంది. పబ్లిసిటీ ఎలా వున్నా, హైప్‌ మాత్రం రెండిటి మీదా ఒకే స్థాయిలో క్రియేట్‌ అయ్యిందన్నది నిర్వివాదాంశం. అన్నట్టు, 'శాతకర్ణి', 'ఖైదీ' సందడి మధ్య 'శతమానం భవతి' హంగామా ఎక్కడా కన్పించడంలేదు. అసలు ఆ స్థాయిలో హంగామా కూడా జరగడంలేదు. అయితే, గత ఏడాది సంక్రాంతికి సైలెంట్‌గా వచ్చి, హిట్‌ కొట్టిన శర్వానంద్‌, ఇప్పుడూ అదే మ్యాజిక్‌ చేస్తాడన్నది టాలీవుడ్‌ వర్గాల్లో విన్పిస్తోన్న వాదన.

Show comments