దొరికిపోయారు: వార్త విజయవాడది.. ఫొటోలు విదేశాలవి!

చంద్రబాబు పాలనలోని ఏపీ మీద భ్రమలు కల్పించే యత్నంలో గ్రాఫిక్స్ ఫొటోలు అయ్యాయి.. సినిమా దర్శకుల క్రియేటివిటీని వాడుకోవడం అయిపోయింది.. రాజధాని విషయంలో రంగురంగుల గ్రాఫిక్స్ ముచ్చటా పాతదైపోయింది! అందుకే ఇప్పుడు విదేశాల్లోని బిల్డింగుల ఫొటోలను వాడుకోవడం మొదలైంది! ఆ బొమ్మలు చూపించి ప్రజలను భ్రాంతులు కల్పించే ప్రయత్నాలకు పదును పెడుతోంది చంద్రన్న అనుకూల మీడియా!

నేడు ‘ఈనాడు’ పత్రిక ఏపీ ఎడిషన్ లో ప్రచురితం అయిన పతాక శీర్షికలోని వార్తే  దీనికి రుజువు. ఆ వార్త సారాంశం ఏమనగా.. విజయవాడలో కొత్తగా ఐటీ కంపెనీలు ఆరంభం అవుతున్నాయనేది! అయితే ఇప్పుడే కాదు.. జూన్ లోనట! ఇంకా నాలుగైదు నెలల తర్వాతి పని గురించి ఇప్పుడే మొదలుపెట్టారు భజంత్రీలు. వీటితోనే ఐటీ హబ్ గా మారిపోతుందట విజయవాడ!

వీటితో ఉపాధి లభించేది ఐదు వందలమందికే అని చెబుతూ కూడా.. విజయవాడ ఐటీ హబ్ గా మారిపోతుంది.. ఆ ఐదొందల మందితోనే విజయవాడ గతి మారిపోతుందని చెప్పడం గమనార్హం. ఆ సంగతలా ఉంటే.. ఈ వార్తకు వాడిన ‘విజయవాడ’ ఫొటో అసలు సంగతి వేరే ఉంది! 

దాని పేరు అగోరా టవర్. అది ఉండేది క్యాపిటల్ ఆఫ్ తైవాన్ లో! తైపీ సిటీలో ఉండే అగోరా టవర్ ను విజయవాడ వార్త కోసం వాడుకోవడం  లార్జెస్ట్ సర్క్యులేషన్ పత్రిక జర్నలిజం! విజయవాడ ఐటీ హబ్ గా మారబోతోందని చెబుతున్న ప్పుడు, అలాంటి భ్రమలతో వార్తలు రాయాల్సి వచ్చినప్పుడు.. ఆ భ్రమను కాస్త గట్టిగా కల్పించాల్సి వచ్చినప్పుడు.. ఫొటో కూడా నకిలీ ఫొటోనే అయ్యుండాలని బలంగా విశ్వసించినట్టున్నారు!

రాస్తున్నదే భ్రమలు కల్పించే వార్త అయినప్పుడు.. ఫొటో వాడటం లో  మాత్రం నకిలీ రూపాన్ని ఎందుకు ప్రర్శించకూడదు? అని ఫీలయ్యారు కాబోలు! అయితే ఇది మీడియా యుగం కాదు.. సోషల్ మీడియా యుగం. దీంతో నెటిజన్లు ఏకేస్తున్నారు!

తైపీ సిటీలోని అగోరా టవర్ ను పతాక శీర్షికలో పెట్టి.. విజయవాడ మీద భ్రమ కల్పించే యత్నం చేస్తుండటం పై దుమ్మెత్తిపోస్తున్నారు సోషల్ మీడియా! ఏమిరా.. మీ కథలు? ఆంధ్రా జనాలంటే మీకు ఎంత చులకన కాకపోతే.. మరీ ఇంతకు తెగించేస్తారా? అని వారు ప్రశ్నిస్తున్నారు! అయినా కొత్తేముందిలే!

Show comments