పుష్కర స్నానాలు.. ఈ నంబర్ల గోల ఏంటో!

ప్రభుత్వానికి ప్రచారం కావాలి.. అనుకూల మీడియాకు నంబర్లంటే భలే ఇష్టం.. ఇంకేముంది.. ఇప్పుడు ఇదో పని అయిపోయింది! గంట గంటకూ పుష్కర స్నానాలు చేసిన భక్తుల నంబర్ ను చెప్పడం మొదలుపెట్టారు! అచ్చం క్రికెట్ స్కోర్ లా .. క్రికెటర్లు తమ జీవితకాలంలో చేసిన రన్నుల్లా పుష్కర స్నానం చేసిన జనాల నంబర్ కూడా పైపైకి పోతోంది!  ఇక్కడ వందలు వేలు స్కోర్లు ఉంటే.. ఇక్కడ లక్షలు కోట్లు అయిపోతున్నాయి అంతే తేడా!

పుష్కర స్నానం చేశారు.. చేశారు.. చేశారు.. పుణ్యం పొందారు.. పొందారు.. పొందారు.. ఇలా చెప్పింది చెప్పీ, చెప్పీ… చెబుతూ పోతే.. వినే జనాలకు కూడా విసుగొస్తుంది కదా! అందుకే ఈ దండకం అందుకున్నారు. రోజుల వారీగా.. గంటల వారీగా లెక్కచెప్పడం మొదలుపెట్టారు.

ఒక ప్రభుత్వం మొదలుపెడితే రెండో ప్రభుత్వం ఊరికే ఉండదు కదా.. ఏపీ ప్రభుత్వం తమ అనుకూల మీడియా చేత పుష్కర స్నానాలు చేసిన జన సంఖ్య గురించి తోచిన నంబర్ ను ప్రకటింపజేసే సరికి.. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది!

దీంతో ఇప్పుడు పోటీ పెరిగిపోయింది. మా దగ్గర ఎక్కువ మంది పుష్కర స్నానం చేశారని.. ఏపీ ప్రభుత్వం అంటుంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా తోచిన నంబర్ ను ప్రెస్ కు విడుదల చేసింది! 

ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా చెబుతున్న లెక్కల ప్రకారం ఏపీలో అరకోటి మంది పుష్కర స్నానం చేశారు! ఒక పచ్చ ఛానల్ లో ఈ విషయాన్ని సెలవిచ్చారు! ఇంకా నాలుగు రోజుల నంబర్ మాత్రమే ఇది! ఈ లెక్కన చూస్తే.. 12 రోజులు ముగిసే సరికి ఓవరాల్ గా కోటిన్నర మంది పుష్కర స్నానం చేశారు అని పచ్చమీడియా లెక్కగట్టవచ్చు.  

మరి ఈ నంబర్ ను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిద్దామని అనుకొంటున్నారేమో.. కానీ, ఎలాంటి శాస్త్రీయ గణన లేని నంబర్ ను చెబితే గిన్నిస్ బుక్ లోకి ఎక్కించరని పచ్చ పెద్దలకు తెలుసో లేదో మరి! నాలుగు రోజుల్లోనే అరకోటి దాటిపోయిందని చెబుతున్నారు.. ఇది వాస్తవమా కాదా? అనేది తెలుసుకోవడం చాలా సింపుల్. ఎన్నో విషయాల్లో నంబర్లను చెప్పి.. జనాలతో ఆడుకోవడం అలవాటైంది. ఇప్పుడు కూడా ఈ మీడియా వర్గం ఎలాంటి శాస్త్రీయతా లేకుండా నంబర్లను చెబుతుండటాన్ని చూస్తే నవ్వుకోవడం వీటిని వినేవాళ్ల వంతవుతోంది!

 ఏపీ జనాభాకు.. అందులో  హిందువుల జనాభాను, ఆ హిందువుల్లో.. పుష్కరాల కోసం జర్నీలు చేసి పుణ్యస్నానాలు చేయడం  పై నమ్మకం ఉన్న వారిని.. వారిలో కూడా ఓపిక, ఆర్థిక శక్తి ఉన్న వారిని, పనులకు విరామమిచ్చి.. స్నానాలు చేయడానికి వెళ్లే తీరిక ఉన్న వారిని ఎవరి సర్కిల్ లో వారు లెక్కగట్టుకోవచ్చు. 

పచ్చ పార్టీకి, పచ్చమీడియాకు ప్రచార పూనకం వచ్చి పుష్కరుడిని వాడేసుకున్నట్టుగా.. జనాల్లో పుష్కరాల ఫీవర్ ఏమీ లేదు. ఎవరి బాధలు వారికున్నాయి.. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు వంటి జిల్లాలను మినహాయిస్తే.. మిగతా జిల్లాల నుంచి భక్తి అధికంగా, ఆర్థిక శక్తి అండగా ఉన్న వాళ్లలో మాత్రమే పుష్కర స్నానాలకు వెళ్లే ఆసక్తి కనిపిస్తోంది.   

అయితే పచ్చమీడియా మాత్రం ఎంత పెద్ద నంబర్ ను చెబితే.. బాబుగారి సమర్థతకు అదో రుజువు అవుతుందని.. తోచిన నంబర్ ను ప్రచారం చేస్తోందిజ ఓవరాల్ గా కోటిన్నర మంది కృష్ణా పుష్కరాల్లో స్నానం చేశారని చెబితే.. అది నమ్మశక్యమైన అంశం అవుతుందా? అనే చెప్పడానికి పచ్చమీడియాకు బుద్ధి లేకపోవచ్చు. బహుశా వినే వాళ్లకు కూడా ఉండదని వీరి నమ్మకమా?

Show comments