పాపం దాసరి.. ఆవేశంలో అర్థముందా.?

'పెద్ద కాపు' దాసరి నారాయణరావు తెగ ఆవేశపడుతున్నారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి దాసరి, కాపు ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని పబ్లిసిటీ పొందడానికి కిందా మీదా పడ్తోంటే, అంతా అవాక్కవ్వాల్సి వస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న అయినా, అక్కడా ఆయన కొందరివాడే. పనిగట్టుకుని సినీ వేదికలపై విమర్శలు చేస్తుండడంతో, 'పెద్దరికం' అనే విషయాన్ని పక్కన పెట్టి మరీ ఆయన్ని దూరం పెడ్తున్నారు కొందరు. 

ఇక, కాపు ఉద్యమం విషయానికి వస్తే, దాసరి నారాయణరావు ఏనాడూ కాపుల అభ్యున్నతి కోసం మాట్లాడింది లేదు. కానీ, ఇప్పుడు మీడియా ముందుకొచ్చి హడావిడి చేస్తున్నారు. దాసరి నారాయణరావుతోపాటు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు.. ఇలా 'పెద్ద కాపులు' చాలామందే కనిపిస్తున్నారు. 'పెద్ద కాపు' అంటే, కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. 

కాపు ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేయడం.. లేదంటే కాపుల మద్దతుతో నాయకులుగా ఎదగడం.. ఇదీ ఈ పెద్ద కాపుల పద్ధతి. 'కాపులకు రాజ్యాధికారం' అనేది ఈనాటి డిమాండ్‌ కాదు. 'మేం పల్లకీలు మోయలేం.. మేమే పల్లకీ ఎక్కుతాం..' అనే నినాదం ఎప్పటినుంచో కాపు సామాజిక వర్గంలో విన్పిస్తోంది. కానీ, ఈ 'పెద్ద కాపులు' ఆ కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని వీలు చిక్కినప్పుడల్లా తాకట్టుపెట్టేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం. 

సరే, కాపులకు అధికారం అనేది కాదిక్కడ పాయింట్‌. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లను కోరుకుంటోంది. రిజర్వేషన్లనే బెల్లం ముక్కని చంద్రబాబు ఎరవేశారు 2014 ఎన్నికల ప్రచారంలో. ఆ బెల్లం ముక్క ఇప్పుడు వాళ్ళకి అందట్లేదు. అదీ అసలు సమస్య. రిజర్వేషన్ల కోసం పోరాటమంటూ ముద్రగడ నిరాహార దీక్ష చేస్తున్నారు. అసలాయన కండిషన్‌ ఏంటో ఎవరికీ తెలియదు. చిరంజీవి తలచుకుంటే, ముద్రగడ పరిస్థితేంటో తెలుసుకోవడం క్షణాల మీద పని. దాసరి నారాయణరావుకైనా అంతే. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తక్కువోళ్ళేమీ కాదు. కానీ, ఆ పని ఎవరూ చెయ్యడంలేదు. 

హైద్రాబాద్‌లో కూర్చుని ఈ పెద్ద కాపులంతా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. 'మేం రాజమండ్రి వెళతాం..' అంటూ దాసరి మరోమారు గర్జించేశారు కామెడీగా. ఏంటీ, హైద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి వెళ్ళేందుకు విమాన టిక్కెట్లు, ట్రైన్‌ టిక్కెట్లు, బస్‌ టిక్కెట్లు కూడా దొరకడంలేదా.? కార్లో పెట్రోల్‌ లేదా డీజిల్‌ కొట్టించుకోడానికీ కుదరడంలేదా.? అన్న డౌట్‌ మీకొస్తే అది మీ తప్పే. ఎందుకంటే, కుంటి సాకులు ఇలానే వుంటాయ్‌ మరి. 

మొదట్లో చిరంజీవి కాస్త ఆవేశపడ్డారు. ఇప్పుడాయన సైలెంటయ్యారు. దాసరి నారాయణరావు మాత్రం వీరావేశం ప్రదర్శిస్తున్నారు. ఎందుకీ ఆవేశం.? అక్కడేమో ముద్రగడ దీక్ష విరమించేశారాయె. ఫ్లూయిడ్లు ఎక్కేస్తున్నాయంటే దానర్థం దీక్ష విరమించినట్లే కదా.! ఇది కూడా తెలీదు పాపం, దాసరి నారాయణరావుగారికి. ఈయన కేంద్ర మంత్రిగా పనిచేశారట. ఏం చేస్తాం.? దేశ దౌర్భాగ్యమిది.

Show comments