స్వచ్ఛభారత్ ప్రచారాన్ని 2014లో గాంధీ జయంతి నాడు మోదీ ప్రారంభించారు. నగర వీధుల్లో చీపురు పట్టుకుని కాస్సేపు తుడిచి ఫోటోలకు పోజులిచ్చారు. ఇక ఆ తర్వాత అందరూ అదే పని చేశారు. సినీతారలు, క్రీడా తారలు, రాజకీయనాయకులు - వారూవీరని లేకుండా పెద్దలందరూ కెమెరా ముందు చీపురు పట్టుకుని కాస్సేపు తుడవడం, తర్వాత కార్లో వెళ్లిపోవడం. తాము ఓ పక్కకు తుడిచిన చెత్త చివరకు ఎక్కడ చేరిందో, దాన్ని ఎలా డిస్పోజ్ చేశారో తెలుసుకునే తీరిక వాళ్లెవరికీ లేదు. గతంలో యుపిఏ ప్రభుత్వం చేపట్టిన 'నిర్మల్ అభియాన్' కార్యక్రమాన్నే పేరు మార్చి మోదీ తన స్టాంపు కొట్టారు, పబ్లిసిటీ దంచుతున్నారు అనుకుని నవ్వుకున్నాం. కానీ గత ఏడాది నవంబరులో ఆ పేర సెస్సు వేసేటప్పటికి నవ్వు యిగిరిపోయింది. అన్ని పన్నులు కలిపేసి జిఎస్‌టి తెస్తామని ఓ పక్క చెపుతూ మధ్యలో యీ సెస్సు ఏమిటి? ఇది చాలనట్లు యీ నెల నుంచి కృషి కళ్యాణ్ సెస్ అని మరోటి వడ్డించారు. పరిసరాలను శుభ్రంగా వుంచడం ప్రభుత్వం పనే కదా, దానికిగాను రకరకాల పన్నులు తీసుకుంటున్నారు కదా, మరి యీ సెస్సులు దేనికి? ప్రచారం చేసిన బాలీవుడ్ యాక్టర్లకు పారితోషికం, నాలుగు చినుకులు పడితే మన నెత్తిమీద విరుచుకు పడే పెద్ద పెద్ద హోర్డింగులలో పోస్టర్ల ఖర్చు అన్నీ మన నెత్తిన రుద్దుతున్నారా? ఈ సెస్సు ఎంతకాలం వుంటుందో ఎవరికీ తెలియదు. మన దేశమంతా శుభ్రపడేవరకూ.. అంటే మాత్రం మన జీవితమంతా సెస్సు కట్టాల్సిందే. లైబ్రరీ సెస్సు అని కడుతూ వుంటాం. ఉన్న లైబ్రరీలు ఎత్తేస్తున్నారు. ఎత్తకుండా వుంచిన చోట పుస్తకాలుంచటం లేదు. మరి అదెక్కడికి పోతోంది? 2014-15 కాగ్ రిపోర్టు ప్రకారం సెస్సుల పేర సేకరించిన 1.4 లక్షల కోట్ల రూపాయలు ఆయా పద్దుల కింద ఖర్చు పెట్టడం లేదు. ఈ స్వచ్ఛభారత్ సెస్సు కింద వచ్చినదాన్ని దేనికి తగలేస్తారో తెలియదు.
స్వచ్ఛభారత్ అభియాన్ కింద నిధుల కేటాయింపు ఎలా వుంటోందో, వాటిలో ఎన్ని అమలవుతున్నాయో యిప్పుడిప్పుడే చెప్పలేం. మూడు నాలుగేళ్లు పోయాక ఏ కాగ్ రిపోర్టో వచ్చినపుడు సంగతులు బయటకు వస్తాయి. ఈ లోపున పత్రికల వాళ్లు, ఎన్‌జిఓలు అక్కడాయిక్కడా సేకరించిన గణాంకాలు, సమాచారం ఆధారంగా కొంత అవగాహన కలుగుతుంది. ఉదాహరణకి ముంబయిని తీసుకుందాం. ముంబయి నగరానికి కేంద్రం స్వచ్ఛభారత్ అభియాన్ పథకం కింద రూ.240 కోట్లు కేటాయించానని చెపుతోంది. కానీ ముంబయి కార్పోరేషన్ (ఎంసిజిఎమ్) మాకు 8.3 కోట్లే వచ్చిందంటోంది. దేశంలోనే అతి ధనిక కార్పోరేషన్ - ముంబయి కార్పోరేషన్. దాని సంవత్సరపు బజెట్ రూ.33 వేల కోట్లు. అయినా అక్కడ శానిటేషన్ సమస్యలు యిబ్బడిముబ్బడిగా వున్నాయి. ముంబయి జనాభాలో 57% మంది మురికివాడల్లో (స్లమ్స్) వుంటారు. వారిలో 21% మంది కమ్యూనిటీ టాయిలెట్స్ (సామూహిక శౌచాలయాలు) వుపయోగిస్తారు. తక్కినవారు బహిరంగ విసర్జనే. బహిరంగ విసర్జన స్థలాలు 118 వున్నాయని కార్పోరేషనే ఒప్పుకుంటోంది. ఇలా బహిరంగ విసర్జన మాన్పించే లక్ష్యాన్ని ఓడిఎఫ్ (ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ) గా వ్యవహరిస్తున్నారు. గాంధీ 150 వ జయంతి అంటే 2019 నాటికి భారతదేశాన్ని ఓడిఎఫ్‌గా అంటే బహిరంగ విసర్జన ముక్త భారత్‌గా చేయాలనే లక్ష్యాన్ని మోదీ నిర్దేశించారు. దానికి గాను రూ. 1.96 లక్షల కోట్లతో 12 కోట్ల మరుగుదొడ్లను గ్రామీణ భారతంలో కట్టాలని సంకల్పించారు.
మరుగుదొడ్లను కట్టించడమైతే కట్టించగలరు కానీ వాటిని వాడేట్లా ఎలా చూడడం? అదీ ప్రధాన సమస్య. నిర్మల్ అభియాన్ రోజుల నుంచి విద్యాబాలన్ చేస్తూ వచ్చిన టీవీ యాడ్స్ కారణంగా యిళ్లల్లో టాయిలెట్ల కట్టించడం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అంతకుముందు అది యింట్లో వుంటే అరిష్టమనే అభిప్రాయం వున్న ప్రాంతాలు కూడా వున్నాయి. ఈ యాడ్ వలన కొందరిలో మార్పు వచ్చి ఆడవాళ్లు మరుగుకై బయటకు పోకూడదనే ఫీలింగు బలపడింది. కానీ చిక్కేమిటంటే టాయిలెట్లు ఆడవాళ్లకే తప్ప మగవాళ్లకు కాదనే భావన పోలేదు. రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపాషనేట్ ఎకనామిక్స్ (రైస్) 5 రాష్ట్రాలలో 3200 కుటుంబాలను సర్వే చేయగా 47% మంది తమకు బహిరంగ విసర్జకే సౌఖ్యంగా వుంటుందని చెప్పారు. ఇంట్లో టాయిలెట్ వున్నా అది ఆడాళ్లు, ముసలివాళ్లు, జబ్బుపడినవాళ్లు వాడతారు తప్ప మేం వాడమని సర్వేలో పాల్గొన్న మగవాళ్లు చెప్పారు. సామూహికంగా కట్టే మరుగుదొడ్లలో, నీటివాడకం అక్కరలేకుండా, చవకలో కట్టే వ్యక్తిగతమైన టాయిలెట్లలో పెద్ద గొయ్యి తవ్వి విసర్జించిన చోట మట్టి వేస్తూ పోతే, కొన్నాళ్లకు దాన్ని తవ్వి తీస్తే మంచి ఎరువు తయారవుతుందని, లేదా అలాటి గోతుల్లోంచి గోబర్ గ్యాస్ తయారుచేసుకుని గ్రామ విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని ఎంత చెప్పినా గ్రామీణ భారతీయులకు అది నచ్చటం లేదు. పొట్ట బరువు తీర్చుకుని వెళ్లిపోవడం తప్ప, మళ్లీ అటు తిరిగి చూడడం కూడా వాళ్ల కిష్టం లేదు. ఆ గోతులను తవ్వడం చాలా అసహ్యకరమైన పని అని వాళ్ల అభిప్రాయం.
ఇలాటి మనస్తత్వం వున్నవాళ్లను మార్చడానికి, ఒప్పించడానికి ఎంతో శ్రమించాలి. అయితే స్వచ్ఛ భారత్ మిషన్‌కౖౖె కేటాయించిన మొత్తం బజెట్‌లో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఇసి అంటారు)లకు కలిపి 8% మాత్రమే ఎలాట్ చేశారు. ఇళ్లల్లో టాయిలెట్లు కట్టుకునేందుకు డబ్బివ్వడానికే ఎక్కువ ప్రాధాన్యత యిస్తున్నారు. ఆ పేరుతో డబ్బు తీసుకుని యింట్లో యింకో గది వేసుకుంటున్నారో లేక మరుగుదొడ్డి కట్టుకుంటున్నారో చూసేవారెవరు? కట్టుకున్నా అందరూ వాడుతున్నారో, కొంతమందే వాడుతున్నారో రోజూ వెళ్లి పరీక్షించేవారెవరు? అయినా నిధుల వితరణ సులభం కావడం చేత ప్రభుత్వం యీ పథకాన్ని ప్రోత్సహిస్తోంది. 1999లో రూ.500 లిచ్చేవారు, ప్రస్తుతం 12 వేలిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వాలు యిచ్చేది ఎలాగూ వుంటుంది. ఎకవుంటబిలిటీ ఇనీషియేటివ్ అనే సంస్థ 2015-16 సం||నికి గ్రామీణ ప్రాంతాలకై కేటాయించిన మిషన్ నిధుల్లో ఫిబ్రవరి నాటికి 49% మాత్రమే విడుదల చేశారని చెప్పింది. తక్కిన 51% మార్చిలో విడుదల చేయగలరా? ఈ స్కీములో మరుగుదొడ్లకై దరఖాస్తు చేసుకున్న కుటుంబాలలో 43% మందికి మాత్రమే నిధులు మంజూరయ్యాయి. ఇచ్చిన నిధులు ఏ మేరకు సద్వినియోగం అవుతున్నాయో చూద్దామని ఐదు రాష్ట్రాలలోని పది జిల్లాలలో ఒక్కో గ్రామంలో 25 యిళ్లు ఎంచుకుంటూ, 7500 యిళ్లను ఎంపిక చేసుకుని ఇనీషిటేయటివ్ ఆఫ్ సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్ (సిపిఆర్) సర్వే నిర్వహించింది. ఆ యిళ్లను ఎంచుకోవడంలో ఒక తరహా పాటించారు. స్వచ్ఛ భారత్ మిషన్ వారి వెబ్‌సైట్‌లో పేరు, అడ్రసుతో సహా ప్రస్తావించిన యిళ్లల్లో ఐదు, తమకు తోచిన 20 యిళ్లు కలిపి మొత్తం 25 యిళ్లు! సర్వే పూర్తయాక వారు అన్నదేమిటంటే - ''వెబ్‌సైట్లలో ప్రస్తావించిన యిళ్లు కొన్ని గ్రామాల్లో లేనే లేవు. కొన్ని సందర్భాల్లో వేర్వేరు గ్రామాల్లో వున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో ఒకే పేరును అనేక గ్రామాల్లో చూపారు.'' అన్నారు. వ్యక్తిగతమైన టాయిలెట్లకు ప్రభుత్వం డబ్బిస్తూ వుంటే యిలాటి అవినీతి జరుగుతోంది. మరి మనదేశంలో బహిరంగ విసర్జన మాన్పడం ఎలా?
బంగ్లాదేశ్ వాసి డా|| కమల్ కార్ అనే ఆయన 2000 సం||రంలో కమ్యూనిటీ లెడ్ టోటల్ శానిటేషన్ (సిఎల్‌టిఎస్) అనే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాడు. ''విదేశీ స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు తీసుకుని యిళ్లల్లో టాయిలెట్లు కట్టడం వలన సమస్య పరిష్కారం కాదని మేం గ్రహించాం. ఉత్తర బంగ్లాదేశ్‌లో రాజ్‌షాహీ అనే గ్రామంలో 200-300 మందిని పోగేసి నేలమీద వాళ్ల వూరి మ్యాప్ గీసి చూపించాం. ఎవరు ఎక్కడెక్కడ విసర్జిస్తున్నారో పసుపుపచ్చ ముగ్గుతో మార్కులు పెట్టి చూపించాం. చూస్తూండగానే మ్యాపంతా పచ్చగా అయిపోవడం వారు గమనించారు. ఆ తర్వాత అదంతా వూరి చుట్టూ వున్న చెఱువులో ఎలా కలుస్తోందో వివరించి చెప్పాం. తాము విసర్జించినదాన్నే ఒకరిదొకరు తాగుతున్నామని, దానిలోనే తమ బట్టలు వుతుక్కుంటున్నామని వాళ్లు గ్రహించి ఏహ్యత కలిగింది. మా దగ్గరకు వచ్చి 'మాకు డబ్బివ్వండి, మరుగుదొడ్లు కట్టుకుంటాం' అన్నారు. 'ఇది డబ్బిచ్చే సంస్థ కాదు, కావాలంటే తక్కువ ధరలో ఎలా కట్టుకోవాలో సూచనలిస్తాం' అని చెప్పాం. సరేనని, వాళ్ల దగ్గరున్నదానితోనే వాళ్లు కట్టుకున్నారు.'' అన్నాడాయన. ఆ ఉద్యమం అలా విస్తరించి బంగ్లాదేశ్‌లో బహిరంగ విసర్జన దాదాపు మాయమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బంగ్లాదేశ్‌ను 99% ఓడిఎఫ్ గా ప్రకటించబడింది. సిఎల్‌టిఎస్ మోడల్‌ను 31 దేశాలు అనుకరించి లాభపడ్డాయి. మన దేశంలో మహారాష్ట్రలో నాందేడ్, అహ్మద్‌నగర్‌లలో హరియాణా, హిమాచల్ ప్రదేశ్‌లలో కొన్ని వూళ్లల్లో అనుసరించి ఫలితాలు సాధించారు. ఈ ప్రయోగానికి విస్తృత ప్రచారం కల్పించాలంటే యాడ్స్ యీ థీమ్ మీద తయారు చేయించాలి. చీపురు పట్టుకునే యాడ్స్ మీద కాదు. భారతీయుల మనస్తత్వాన్ని, ఆలోచనా విధానాన్ని అవగాహన చేసుకుని తదనుగుణంగా స్ట్రాటజీ తయారుచేసుకోవాలి.
ఉదాహరణకి మన యిళ్లల్లో తయారయ్యే చెత్తను తడి, పొడిగా విడగొట్టి వేర్వేరు బ్యాగుల్లో వేసే పని మనమే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మేం నివసించే ప్రాంతంలో రెండు రకాల బకెట్లు పంపిణీ చేశారు. మనం విడివిడిగా వేసినా, కార్పోరేషన్ పనివారు తీసుకెళ్లేటప్పుడు రెండూ కలిపేస్తున్నారు. అంటే సప్లయిరు వద్ద బకెట్లు కొనేందుకు చూపిన ఉత్సాహం పథకాన్ని అమలు చేయడంలో కార్పోరేషన్ చూపటం లేదన్నమాట. ఇక్కడే కాదు, ఎంతో పెద్ద బజెట్ వున్న ముంబయి కార్పోరేషన్ కూడా యిదే పద్ధతి. చెత్తను తొలగించి, దాన్ని నిర్మూలించడం (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)లో అదీ చాలా వెనకబడి వుంది. పట్టుకెళ్లిన చెత్త దేవ్‌నార్ డంపింగ్ గ్రౌండ్‌లో పడేస్తున్నారు. రోజుకి 5500 మెట్రిక్ టన్నుల చెత్త చేరుతోంది. అక్కడ జనవరి-మార్చి మధ్య పదిసార్లు మంటలు చెలరేగాయి. వాటిల్లోంచి లేచిన పొగలతో అక్కడి జనం ఉక్కిరిబిక్కరయ్యారు. ఎవరో దుండగులు నిప్పంటించారు అంటోంది కార్పోరేషన్. చెత్తంతా యిక్కడిదాకా రానీయకుండా హౌసింగ్ సొసైటీలే వాళ్ల సొంత కాంపౌండ్లలో చెత్తను వేరు చేసి, గోతులు తవ్వి కంపోస్టు చేయాలని సలహా లిస్తోంది. ఇది సాధ్యపడే విషయమేనా? కార్పోరేషన్ బాగా పనిచేయాలంటే దానిలోని ఉద్యోగుల పనితీరు మెరుగు పడాలి. కానీ వాళ్లల్లో అసంతృప్తి చాలా వుంది. ముంబయి మునిసిపల్ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ ''స్వచ్ఛ భారత్ మిషన్ అంటూ మాకు పని పెంచారు. ఎక్కువసేపు పని చేయమంటున్నారు. గ్లవ్స్ అడిగితే 45 రోజుల తర్వాత యిచ్చారు. మహిళా వర్కర్లకు బట్టలు మార్చుకునేందుకు ఎక్కడా సౌకర్యాలు కల్పించలేదు. బాత్‌రూము లున్నచోట సబ్బులు, తువ్వాళ్లు లేవు.'' అని ఫిర్యాదు చేస్తున్నారు. అనేక మహానగరాల్లో చెత్త పేరుకుపోతోంది. వాటిని ప్రాసెస్ చేయవలసిన ఏజన్సీలు ఆ పని చేయటం లేదు. కార్పోరేషన్లు, రాష్ట్రప్రభుత్వాలు పారిశుధ్యం పేర రకరకాల పన్నులు తీసుకుంటున్నాయి తప్ప వీటిని పట్టించుకోవటం లేదు. ఇప్పుడు కేంద్రం కూడా సెస్సు విధించడం మొదలుపెట్టింది. చివరకు యిది ఎలా తేలుతుందో చూడాలి.
- ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2016)