టీడీపీ రాజకీయమే..భూమాను బలితీసుకుందా?

ఇప్పుడు కాదు... ఏడాదిన్నర క్రితం భూమా నాగిరెడ్డి అట్రాసిటీ కేసు పెట్టించి, జైలుకు తీసుకెళ్లినప్పుడే తొలిసారి ఆయన గుండెపోటుకు గురయ్యారు. తీవ్రమైన ఛాతి నొప్పితో విలవిల్లాడిపోయారాయన... అయితే ప్రభుత్వానికి మాత్రం కనికరం లేకపోయింది. “నన్ను టచ్ చేయొద్దు..’’ అనే ఒకే మాటకు ఆయనపై అట్రాసిటీ కేసు పెట్టించి వేధించిందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. భూమాను తమ పార్టీలోకి చేర్చుకోవాలి.. లక్ష్యంతో తెలుగుదేశం అధినేత ఆ తరహాలే వేధింపులు మొదలుపెట్టించాడు.

భూమాను అరెస్టు చేసినప్పుడు ఆయన జైలుకు వెళ్లగానే.. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడితే చివరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో చేర్చారు. ఒకవైపు పోలీస్ కస్టడీలో ఉంటూ... మరోవైపు నిమ్స్ లో చికిత్స తీసుకున్నారు నాగిరెడ్డి. మరి ఆయన ఛాతి నొప్పితో బాధపడుతున్నా.. ఆయనను కస్టడీ నుంచి వదలియడానికి ప్రభుత్వం సమ్మతించలేదు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడానికి అవకాశం ఇవ్వలేదు. పైగా ఛాతి నొప్పిని కేవలం తప్పించుకోవడానికి చూపిన కారణమని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారప్పట్లో.

చివరకు అవే కేసులను తప్పించుకోవడానికి.. ఆ వేధింపుల నుంచి తప్పించుకోవడానికి.. తెలుగుదేశంలో చేరారు భూమా నాగిరెడ్డి. ఈ విషయాన్ని వారు వైకాపా అధినేతకు కూడా స్పష్టం చేశారు. శోభ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తాము ప్రస్తుతం చాలా దీనస్థితిలో ఉన్నామని.. వేధింపులను తట్టుకోలేని స్థితిలో ఉన్నామని.. దీంతో ఫిరాయింపు  తప్పడంలేదని వారు.. జగన్ కు కూడా డైరెక్టుగా చెప్పారు. 

మరి ఆ తర్వాత కూడా భూమా తెలుగుదేశంలో ప్రశాంతంగా ఉన్నదేమీ లేదు... కేసుల పీడ తొలగలేదు. అప్పుడప్పుడు.. అందుకు సంబంధించిన అప్ డేట్స్ వస్తున్నాయి. కేసులను ఎత్తేయకుండా... చంద్రబాబు వాటిని కొనసాగింపజేశారు. కేసులు ఎత్తేస్తే భూమా మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోతారేమో అనే తీరున వ్యవహరించారు. ఇక మంత్రిపదవి విషయంలో భూమాకు ఇచ్చిన హామీని ఎంతకూ నెరవేర్చలేదు.

మరోవైపు శిల్ప వర్గంతో పోటు... మళ్లీ టికెట్ సంపాదించుకోవాలంటే.. వాళ్లతో పోరాడాల్సిందే. చంద్రబాబేమో.. సర్దుకుపొండి, రాజీపడాలి అంటారు కానీ.. టికెట్ విషయంలో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఇక తనకు మంత్రిపదవి వద్దు.. కూతురికి ఇవ్వండి చాలు, అని పదే పదే విజ్ఞప్తి చేస్తూ వచ్చారు భూమా. ఇదే సమయంలో... తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఒక లీకు వదిలింది.

ఫిరాయింపుదారులకు మంత్రి పదవులను ఇవ్వను అని గవర్నర్ అంటున్నారని.. అంటూ, భూమాకు పెద్ద షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎవరి పేరు చెబితే... వారి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం... గవర్నర్ బాధ్యత. ఫిరాయింపుదారులు అని అభ్యంతరం చెప్పినా... వారు త్వరలోనే రాజీనామా చేస్తారు, మళ్లీ పోటీ చేస్తారు అని ముఖ్యమంత్రి గవర్నర్ కు చెప్పవచ్చు. అయితే ఫిరాయింపుదారుల తలనొప్పిని వదిలించుకోవడానికి చంద్రబాబు గవర్నర్ తో గేమ్ ఆడారు అనేది సుస్పష్టం.

ఈ నేపథ్యంలో.. చంద్రబాబుతో చివరిసారి మీటింగ్ లో కూడా భూమ కూతురు అఖిలప్రియకు మంత్రిపదవి విషయంలో విజ్ఞప్తినే చేసుకున్నట్టయ్యింది. అయితే యథావిధిగానే బాబు నుంచి అస్పష్టమైన సమాధానం వచ్చినట్టు సమాచారం. మరోవైపు జిల్లా రాజకీయాలు తెలుగుదేశంపార్టీకి సానుకూలంగా లేవు. ఎమ్మెల్సీ గెలిచే పరిస్థితి కనిపించడంలేదు. ఓడితే.. ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వను అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. బహిరంగంగా కూడా చెప్పారు. అక్రమపద్దతిలో అయినా గెలవాల్సిందే అని ఆయా జిల్లాల నేతలకు బాబు హుకుం జారీ చేశారనే వార్తలు వచ్చాయి. ఇలాంటి బాధ్యత భూమాపై మరింత ఒత్తిడిని పెంచింది.

నిమిషానికి డెబ్బై రెండుసార్లు కొట్టుకోవాల్సిన గుండె.. రెండువందల సార్లు కొట్టుకునేంత వేగానికి వెళ్లింది.. గుండెపోటు ఫలితంగా మెదడుకు రక్తప్రసరణ ఆగడం.. ఆ వెంటనే ఫిట్స్ రావడం.. అచేతనంగా కుప్పకూలిపోవడం.. నిర్జీవంగా మారిపోవడం.. ఇదంతా కేవలం అప్పటికే ఎదుర్కొంటున్న ఒత్తిడి, తీవ్రమైన మానసిక ఆందోళన ఫలితంగానే వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి దీనికి తెలుగుదేశం పార్టీ రాజకీయం ఎంత వరకూ కారణమో సుస్పష్టమే.

Show comments