వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ టైమ్ చూసి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీలో వున్నా, సాంకేతికంగా ఇంకా జలీల్‌ఖాన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
జలీల్‌ఖాన్, తెలుగుదేశం పార్టీలో చేరిందే మంత్రి పదవి కోసం. మంత్రి పదవి ఇస్తానని చెప్పి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చాలామందికి చంద్రబాబు గాలమేశారు. ఇది ఓపెన్ సీక్రెట్. 'అన్ని మంత్రి పదవులు ఖాళీగా వున్నాయా.?' అన్న మినిమమ్ కామన్‌సెన్స్ కూడా లేకుండా, చంద్రబాబుకి 'జై' కొట్టేశారు 20 మంది ఎమ్మెల్యేలు. ఇందులో అందరూ కాకపోయినా, ఐదారుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకునే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు.
లిస్ట్ చెప్పుకోవాలంటే, తొలి పేరు భూమా నాగిరెడ్డిదే. ఆ తర్వాతి ప్లేస్ జ్యోతుల నెహ్రూది. జలీల్‌ఖాన్, సుజయ కృష్ణ రంగారావు, ఇంకొందరు ఆ తర్వాతి స్థానాల్లో వుంటారు. రాయలసీమ కోటాలో భూమా నాగిరెడ్డి, కాపు కోటాలో జ్యోతుల నెహ్రూ, ఉత్తరాంధ్ర పేరు చెప్పి సుజయ కృష్ణ రంగారావు, మైనార్టీ కేటగిరీలో జలీల్‌ఖాన్ మంత్రి పదవులు తమకే దక్కుతాయంటూ అనుచరులకు చెప్పేసుకున్నారు.
చంద్రబాబు సంగతి తెల్సిందే కదా, నమ్మించి గొంతు కోసెయ్యడంలో ఆయన ఎక్స్‌పర్ట్.. అని వైఎస్సార్సీపీ హెచ్చరించినా, పాపం ఆ 20 మంది ఎమ్మెల్యేలు, జగన్‌ని లెక్క చేయలేదు.. చంద్రబాబు పంచన చేరారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు. పార్టీలో చేరేందుకోసం ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల్లోనే చాలావరకు అటకెక్కాయని ఇప్పుడు తీరిగ్గా వారిలో కొందరు వాపోతున్నారట. జలీల్‌ఖాన్ కాస్త ధైర్యం చేసి, ఈ రోజు చంద్రబాబుకి ఝలక్ ఇచ్చారు.
విజయవాడలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో, మైనార్టీలందరి సమక్షంలో జలీల్‌ఖాన్ మంత్రి పదవి అంశాన్ని లేవనెత్తడంతో చంద్రబాబు షాక్‌కి గురయ్యారు. 'మైనార్టీ శాఖల్లాంటివి ఇచ్చి చేతులు దులుపుకుంటారేమో, ప్రాధాన్యత గల శాఖ మైనార్టీలకు కేటాయించాలి..' అని డిమాండ్ చేయడం చంద్రబాబుకి ఇంకా పెద్ద షాక్. 'నాకే ఆ మంత్రి పదవి కావాలి..' అని చెప్పకుండా, లాజికల్‌గా చంద్రబాబుకి జలీల్‌ఖాన్ షాకిచ్చేసరికి, టీడీపీ శ్రేణులూ అవాక్కయ్యాయి.
ఈ విషయంలో జలీల్‌ఖాన్ తెగువని మెచ్చుకోవాల్సిందే. ఎప్పుడో నాలుగైదు నెలల క్రిందట ఇచ్చిన మాటని ఇంకా నెరవేర్చని చంద్రబాబుని నిలదీసే ధైర్యం జలీల్‌ఖాన్‌కి తప్ప ఇంకెవరికీ లేదంటే ఏమనుకోవాలి.? మరీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వున్నారా.? ఏమో మరి, వాళ్ళకే తెలియాలి.