పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత, బ్యాంకుల్లో వున్న నగదుని తీసుకునేందుకు ఖాతాదారుల కష్టాలు ఇంకా ఇంకా కొనసాగుతూనే వున్నాయి. వారానికి 20 వేల రూపాయలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా మొదట నిబంధనల్ని తెరపైకి తెచ్చారు. కానీ, అందులో సగం కూడా 50 రోజులపాటు ఎవరికీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎలాగైతేనేం, 50 రోజుల తర్వాత పరిస్థితి కాస్త మెరుగయ్యింది. అయితే, ఇప్పటికీ బ్యాంకులో అత్యవసర సమయాల్లో తగినంత సొమ్ముని తీసుకునేందుకైతే అవకాశం లేదు.
తాజాగా, నగదు విత్‌డ్రా పరిమితిని 24 వేల రూపాయల నుంచి 35 వేలకు పెంచేందుకు రిజర్వు బ్యాంకు సన్నాహాలు చేస్తోందట. మీ అక్కౌంట్లలో వున్న సొమ్ముని, మీరు మీ అవసరానికి విత్‌డ్రా చేసుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు.. ఇదెక్కడి న్యాయం.? అని ప్రశ్నించడానికి వీల్లేని పరిస్థితి. డబ్బులు బ్యాంకుల్లోంచి తీసుకోలేని పరిస్థితుల్లో, అక్కడ పేరుకుపోయిన నగదు నిల్వల్ని, బ్యాంకుల బలంగా చూపే ప్రయత్నం చేస్తోంది రిజర్వు బ్యాంకు. కేంద్రం ఇదంతా తమ ఘనతేనని చెప్పుకుంటోందనుకోండి.. అది వేరే విషయం.
నిగదు విత్‌డ్రా పరిమితి పెరుగుతోందట.. ఇది నిజంగానే బంపర్ ఆఫర్.. అంటూ 'మోడీ మాస్కులు' వేసుకున్న కొందరు ప్రచారం మొదలు పెట్టారు. సామాన్యుడికి వారంలో 24 వేల రూపాయలు విత్ డ్రా చేసుకునే అవసరం రావొచ్చు, రాకపోనూవచ్చు. కానీ, అత్యవసర సమయాల్లో మాత్రం ఎవరికైనా అది నరకప్రాయమే కదా.! నల్లధనాన్ని వెలికి తీయడానికన్నారు, అది బయటకు రాలేదు. తీవ్రవాదాన్ని అరికట్టడానికన్నారు.. అదీ జరగలేదు.. ఇంకేవేవో కథలు చెబుతూనే వున్నారుగానీ, అవన్నీ కట్టుకథలుగానే మిగిలిపోయాయి.
ప్లాస్టిక్ మనీ, డిజిటల్ మనీ, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్, చెక్ ట్రాన్సాక్షన్స్.. ఇలాంటివన్నీ మొదట్లో సందడి చేసినా, టెక్నికల్ ఫెయిల్యూర్స్ కారణంగా అవన్నీ దాదాపుగా అభాసుపాలైపోయిన విషయం విదితమే. క్యాష్ లెస్ నుంచి లెస్ క్యాష్‌గా మారిన పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారం.. ఇప్పుడు మళ్ళీ క్యాష్ చుట్టూనే పరుగులు పెడ్తోంది. కొండను తవ్వి ఎలకను పట్టడం కాదు.. అసలు లేని ఎలకని వున్నట్లుగా చూపించి, కొండను తవ్వేశారన్నమాట. దటీజ్ నరేంద్రమోడీ.!