చంద్రబాబూ...అప్రమత్తంగా ఉన్నారా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటిస్తున్నారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా చేస్తానని విదేశీ పెట్టుబడిదారులకు చెప్పుకుంటున్నారు. మరోపక్క రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదని ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా పుష్కరాలు బ్రహ్మాండంగా నిర్వహించి భక్తులను, ఆస్తికులను ఆకట్టుకోవాలని కృషి చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి తాను కష్టపడుతున్నంతగా ఎవ్వరూ కష్టపడటంలేదని ప్రచారం చేసుకుంటున్నారు. 

ఇదంతా సరేగాని అసలు రాష్ట్ర భద్రత గురించి ఆలోచిస్తున్నారా? రాష్ట్రానికి ఎప్పుడైనా పెను ప్రమాదం ముంచుకొస్తుందని అనుకుంటున్నారా?హైదరాబాదులో భయంకరమైన ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఆంధ్రాలోనూ రావొచ్చేమోనని అనుకుంటున్నారా? ఇవన్నీ మన సందేహాలు. చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. హైదరాబాదులో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయకుండా ఉన్నట్లయితే అది మరో ఇస్తాంబుల్‌ అయ్యేది. 

తెలంగాణ రాజధాని ఉగ్రవాదుల అడ్డా అనే విషయం కొత్తది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో గోకుల్‌ ఛాట్‌, లుంబినీ పార్క్‌, దిల్‌సుఖ్‌ నగర్‌...ఇలాంటి ఘటనలెన్నో చూశాం. మరోసారి అలాంటిదే జరగాల్సింది. కాని తప్పిపోయింది. ప్రస్తుతం ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదుల డేగ కళ్లు ఆంధ్రప్రదేశ్‌ మీద పడ్డాయని రక్షణరంగ నిపుణులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు చెబుతున్న మాట. హైదరాబాదులో జరిగినట్లుగా ఆంధ్రాలో ఉగ్రవాద దాడులు జరిగిన దాఖలాలు లేవు. కాని ఇకముందు ఆ ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఐఎస్‌ ఉగ్రవాదులు ఆంధ్రాను అధ్యయనం చేస్తున్నారు. దాడులకు అనుకూలంగా ఉండే ప్రాంతాల గురించి తెలుసుకుంటున్నారు. టార్గెట్లు నిర్ణయించుకుంటున్నారు. 

ఈ రాష్ట్రానికి దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్రం ఉండటం ఉగ్రవాదులకు అనుకూలాంశమని భద్రత, రక్షణ రంగాల నిపుణులు చెబుతున్నారు. సముద్రం ద్వారా రాష్ట్రంలోకి చొరబడే అవకాశాలున్నాయి. అందుకే సముద్రతీరం వెంట భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరముంది. దీనికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి, ఎక్కువ నిధులు కేటాయించాల్సివుంది. ముంబయి దాడులకు తెగబడిన ఉగ్రవాదులు సముద్రం ద్వారానే వచ్చారనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) ఏపీలోనే ఉన్న సంగతి తెలుసు. ఉగ్రవాదులకు ఇదొక టార్గెట్‌. 

కృష్ణపట్నం, దుగరాజపట్నం నౌకాశ్రయాలు, విశాఖపట్నం కూడా ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా బలహీనమైందని, భద్రత, రక్షణపరంగా తగిన సాధనసంపత్తి లేదనే విషయం కూడా ఉగ్రవాదుల దృష్టిలో ఉండే ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం, దీనికి బౌద్ధ మత కేంద్రంగా పబ్లిసిటీ ఇవ్వడం మొదలైనవి కూడా ఐఎస్‌ దృష్టిలో ఉన్నాయి. తాలిబన్లు గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని పురాతన బుద్ధ విగ్రహాలను పేల్చేసిన ఘటనలున్నాయి. 

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, కొండలు తొలిచి నిర్మించిన పురాతన  బుమియాన్‌ బుద్ధ విగ్రహాన్ని తాలిబన్లు పేల్చేశారు. ఐఎస్‌ ఉగ్రవాదులూ అందుకు భిన్నం కాదు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ ఉగ్రవాదుల దృష్టిలో ఉంటూనే ఉంది.  తిరుమలలో అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. హైదరాబాదులో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన తరువాత తిరుమలలో హైఅలర్ట్‌ ప్రకటించినట్లు సమాచారం. 

అమరావతికి విదేశీ పెట్టుబడిదారులు కూడా ఎక్కువమంది వస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు, కంపెనీలు నెలకొల్పాలనే ఉద్దేశంతో, రాజధాని నిర్మాణంలో భాగం పంచుకోవాలనే అభిప్రాయంతో విదేశీయులు తరచుగా వస్తూనే ఉన్నారు. దీనివల్ల కూడా అమరావతి పేరు విదేశీ మీడియాలో బాగా ప్రచారమైంది. ఏదిఏమైనా ఐఎస్‌ ఉగ్రవాదులు ఆంధ్రాపై కన్నేశారని ఇంటలిజెన్స్‌ వర్గాలు, రక్షణ రంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుంది. షార్‌కు, రేపులకు, విమానాశ్రయలకు, సముద్రతీరానికి పటిష్ట భద్రత కల్పించాల్సివుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం భద్రత విషయంలోనూ ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తే క్షమార్హం కాదు. 

Show comments