స్మాల్‌ స్క్రీన్‌ రెబల్‌ స్టార్‌ రోజా.!

రాజకీయాల్లో 'రచ్చ'కి కేరాఫ్‌ అడ్రస్‌ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా. ఆమె నోటికి హద్దూ అదుపూ వుండదు. రాజకీయ నాయకురాలిగా ఆమె తెలుగుదేశం పార్టీలో పాపులర్‌ అయ్యిందీ, వైఎస్సార్సీపీలో హల్‌చల్‌ చేస్తోన్నదీ ఆ 'రెబలిజం' కారణంగానే. ఆమె ఏమైనా అనేస్తారు.. ఎవర్నయినా ఎలాగైనా విమర్శించేస్తారు.. ఆ తర్వాత ఆమె తనకు నచ్చినట్లుగా తన మాటల్ని మార్చేసుకుంటారు. దటీజ్‌ రోజా. 

ఇక, అసలు విషయానికొస్తే వెండితెరపై గ్లామరస్‌ హీరోయిన్‌గా రోజా ఓ వెలుగు వెలిగారు. ఆమె నవ్వుకే లక్షలాదిమంది అభిమానులుండేవారు అప్పట్లో. బుల్లితెరపైనా రోజా నవ్వులకి వీరాభిమానులు ఎందరో వున్నారు. 'జబర్‌దస్త్‌' ప్రోగ్రామ్‌లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ రోజా.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. అనసూయ, రష్మి యంగ్‌ గ్లామర్‌తో బుల్లితెర వీక్షకుల్ని కట్టి పడేస్తున్నా, రోజా లేని జబర్‌దస్త్‌ని ఊహించుకోలేం. 

ఆ మధ్య ఓ ప్రోగ్రామ్‌లో రోజా, మహిళలతో ఆడించారు, పాడించారు.. ఆమె కూడా ఆటలాడారు. అప్పట్లో ఆ ప్రోగ్రామ్‌ సూపర్‌ హిట్‌. తాజాగా, మరో కొత్త ప్రోగ్రామ్‌లో కనిపిస్తున్నారు రోజా. అదే రచ్చబండ. ఫ్యామిలీ గొడవల్ని తీర్చడం ఈ ప్రోగ్రామ్‌ ఉద్దేశ్యం. ఇప్పటికే జీవిత, సుమలత ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. మంచు లక్ష్మి పలువురు సెలబ్రిటీల్ని తీసుకొచ్చి, దాదాపు ఇలాంటిదే ఓ షోను నిర్వహిస్తోన్న విషయం విదితమే. 

బాద్‌ షా డిసైడ్‌ అయితే వార్‌ వన్‌ సైడ్‌ అయినట్లే.. అన్నట్లుగా, రోజా ఎంటర్‌ అయ్యాక ఈ తరహా టీవీ షోస్‌లో సీన్‌ మారిపోయింది. రచ్చబండ షో ఇప్పుడు బుల్లి తెరపై హాట్‌ టాపిక్‌ అయ్యింది. జబర్‌దస్త్‌లా సాఫ్ట్‌గా నవ్వుతూ ఈ కార్యక్రమంలో రోజా కన్పించడానికి వీల్లేదు. అసలే ఎమ్మెల్యే, పైగా డైనమిక్‌. ఇంకేముంది, అదిలించేసి.. అదరగొట్టేస్తున్నారు రోజా. అతి తక్కువ కాలంలోనే ఈ షో మంచి రేటింగ్స్‌ సంపాదించుకుంటోందంటే అదీ రోజాకి వున్న ఫాలోయింగ్‌. అందుకే ఇప్పుడు అంతా రోజాని బుల్లితెర రెబల్‌ స్టార్‌ అనేస్తున్నారు.

Show comments