అలనాటి జ్యోతిలక్ష్మి ఇక లేరు

ఐటమ్‌ బాంబ్‌.. అంటూ ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఐటమ్‌ సాంగ్‌ బ్యూటీస్‌ని ఒకప్పుడు 'వ్యాంప్‌' అని పిలిచేవాళ్ళం. ఇప్పుడంటే కొన్ని సినిమాలకు మాత్రమే 'ఐటమ్‌ సాంగ్‌' స్పెషల్‌. అప్పుడలా కాదు, వ్యాంప్‌తో పాట లేకుండా సినిమా వుండేది కాదు. బార్‌ డాన్సులు అప్పట్లో దాదాపుగా ప్రతి సినిమాలోనూ కన్పించేవి. బార్‌ డాన్సులకు అవకాశం లేకపోతే, ఏదో ఒక రూపంలో వ్యాంప్‌తో పాట చేయించాల్సిందే.. అది ఎలాంటి సినిమా అయినాసరే. 

అలాంటి వ్యాంప్‌ పాత్రలకు పెట్టింది పేరు అంటే ముందుగా చెప్పుకోవాల్సింది జ్యోతిలక్ష్మి గురించే. ఆ తర్వాత జయమాలిని, అనురాధ.. ఇలా చాలామంది తమ అందాల ఆరబోతతో తెలుగు తెరపై వెలుగులు విరజిమ్మారు. అప్పట్లో వ్యాంప్‌ అంటే అందాల విందు ఒక్కటే కాదు, నటనా ప్రతిభతోనూ ఆకట్టుకునేవారు. కథలో లీనమయ్యేవారు. అలాగే 'వ్యాంప్‌' అన్న పేరుకి వన్నె తెచ్చిన జ్యోతిలక్ష్మి ఇక లేరు. అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. 

ఒకప్పుడు వ్యాంప్‌ పాత్రలతో తెలుగు తెరపై దుమ్మురేపిన జ్యోతిలక్ష్మి, కొన్నాళ్ళు గ్యాప్‌ తీసుకున్నారు. చాలాకాలం గ్యాప్‌ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయిన జ్యోతిలక్ష్మి, ఇటీవల బుల్లితెరపై కూడా కనిపిస్తున్న విషయం విదితమే. హఠాత్తుగా ఆమె అనారోగ్యం బారిన పడ్డారనీ, పరిస్థితి విషమించి ఆమె తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎన్టీఆర్‌, అక్కినేని, శోభన్‌బాబు, కృష్నంరాజు, కృష్ణ.. ఇలా ఆనాటి హేమాహేమీలతోపాటు, అప్పటికి యంగ్‌ జనరేషన్‌ అయిన చిరంజీవి తదితర హీరోలతోనూ ఐటమ్‌ సాంగ్స్‌ చేశారు జ్యోతిలక్ష్మి. అప్పటికీ ఇప్పటికీ తనలో జోష్‌ తగ్గలేదంటూ ఈ మధ్యనే పలు ఇంటర్వ్యూల్లో ఆమె వ్యాఖ్యానించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 

జ్యోతిలక్ష్మి సుమారు 300 సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించి మెప్పించారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని తెలుగు, తమిళ సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. చెన్నయ్‌లో ఈ రోజు మధ్యాహ్నం జ్యోతిలక్ష్మి పార్తీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. Readmore!

Show comments

Related Stories :