రఘువీరాకీ జోకులొచ్చండోయ్‌.!

పాపం రఘువీరారెడ్డి.. నాయకుల్లేని పార్టీకి ఆయనో అధిపతి. గతంలో మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి, ఏదో అలా అలా ఏపీసీసీ అధ్యక్షుడిగా నెట్టుకొచ్చేస్తున్నారు. నాయకుల్లేకనేం చాలామంది వున్నారు కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో. కానీ, చాలామంది కాంగ్రెస్‌ నేతలు, కాంగ్రెస్‌ పార్టీలో కనిపించరాయె. గ్లామర్‌ పరంగా, కాంగ్రెస్‌ పార్టీకి చిరంజీవే పెద్ద దిక్కు. కానీ, ఆయనా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా వుంటున్నారు. అఫ్‌కోర్స్‌.. ఆయన వల్ల కాంగ్రెస్‌కి ఒరిగిందేమీ లేదనుకోండి.. అది వేరే విషయం. 

అసలు విషయమేంటంటే, రఘువీరారెడ్డి ఈ మధ్య జోకులు బాగా పేల్చుతున్నారు. ఆ జోకుల్లో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఐస్‌క్రీమ్‌తో పోల్చారు. ఐస్‌క్రీమ్‌లా వైఎస్సార్సీపీ కరిగిపోతుందని జోస్యం చెప్పారు రఘువీరారెడ్డి. ఈ మాట టీడీపీ నేతలో, బీజేపీ నేతలో చెప్పినా ఓ లెక్క. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండు పార్టీలదే అధికారం. అసలంటూ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఉనికి అనేదే లేదు. అలాంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న రఘువీరారెడ్డి, వైఎస్సార్సీపీని ఐస్‌క్రీమ్‌లా అభివర్ణించడాన్ని ఏమనుకోవాలి.? 

అన్నట్టు, రఘువీరా ఈ మధ్యకాలంలో పార్టీ కోసం ఏమాత్రం పనిచేయడంలేదని ఆరోపిస్తూ, కొందరు ఏపీ కాంగ్రెస్‌ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. రఘువీరారెడ్డిని తప్పించి ఇంకెవర్నయినా పీసీసీ అధ్యక్షుడ్ని చేయాలన్నది వారి డిమాండ్‌. విషయం ఆ నోటా ఈనోటా రఘువీరారెడ్డి చెవిన పడేసరికి, ఆయన తన ఉనికిని చాటుకునేందుకు.. ఇదిగో, ఇలా వైఎస్సార్సీపీ మీద విరుచుకుపడ్తున్నారు. అక్కడికి ఆయన టీడీపీని విమర్శించినా ఓ అర్థం వుండేది. 

విపక్షాలన్నీ కలిసికట్టుగా వుంటే, అధికారపక్షంపై ఒత్తిడి తీసుకురావడానికి వీలుంటుంది. తద్వారా విపక్షాలకు రాజకీయంగా బలం పెరిగే అవకాశముంది.. కాస్తో కూస్తో ప్రజలకూ మేలు జరుగుతుంది. మామూలుగా అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ బలోపేతమవడాన్ని కోరుకోవాలి. ఎందుకంటే, అసెంబ్లీలో వున్నది ఒకే ఒక్క ప్రతిపక్షం అది కూడా వైఎస్సార్సీపీనే గనుక. ఏంటో, రఘువీరారెడ్డి.. బొత్తిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులు.. అని చెప్పుకోడానికి ఎవరూ దొరక్క, ఇలా మతిభ్రమించి మాట్లాడుతున్నారేమోనని వైఎస్సార్సీపీ కూడా, రఘువీరా విమర్శల్ని లైట్‌ తీసుకుంది. ప్చ్‌, రఘువీరా పరిస్థితి అలా తయారైంది మరి.

కొసమెరుపు: రఘువీరారెడ్డి టీడీపీలోకి వెళ్ళాలనే ఆలోచనలేమీ చెయ్యట్లేదు కదా.!

Show comments